కేసీఆరా మజాకానా.. వలసలపై భారీ నిర్ణయం

కాస్త లేటైనా.. తీసుకునే నిర్ణయం ఏదైనా లేటెస్టుగా ఉంటుందన్న మాటకు తగ్గట్లే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. లాక్ డౌన్ వేళ.. సొంతూరుకు వెళ్లేందుకు వలస కూలీలు.. కార్మికులు.. ఉపాధి కోసం వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారు తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున నడిచి వెళుతున్న వైనంపై తెలిసిందే. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. వందలాది కిలోమీటర్లు నడిచైనా సొంతూరుకు వెళ్లాలని తపిస్తున్న బడుగుజీవులకు భారీ ఊరట కలిగించేలా నిర్ణయాన్ని తీసుకున్నారు.

వలస కూలీలు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు వీలుగా వారం రోజుల పాటు ప్రతి రోజూ 40 రైళ్లు నడపాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. బిహార్.. ఒడిసా.. ఝూర్ఖండ్.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడపాలని డిసైడ్ చేశారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

సోమవారం రాత్రి కాస్త ఆలస్యంగా ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. వలస కార్మికులు ఎవరూ ఆందోళన చెందొద్దన్న భరోసాను ఇచ్చిన ఆయన.. లాక్ డౌన్ వల్ల కార్మికులు పడుతున్న ఇబ్బందులపై ప్రగతిభవన్ లో సుదీర్ఘంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యతో మాట్లాడి.. ప్రత్యేక వలస రైళ్లను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ఇందుకోసం ప్రత్యేక అధికారిక సందీప్ సుల్తానియా.. సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ లను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది.

తమ సొంతూళ్లకు వెళ్లేందుకు వీలుగా ఇప్పటికే వలసకూలీలు.. కార్మికులు తాముండే పోలీస్ స్టేషన్లలో పేర్లు నమోదు చేయించుకోవటం తెలిసిందే. రానున్న రోజుల్లో కూడా పోలీస్ స్టేషన్లలో పేర్లు నమోదు చేసుకోవటం ద్వారా.. వారి గమ్యస్థానాలకు చేరేలా రైళ్లను నడుపుతారు. తెలంగాణలో హైదరాబాద్ తో పాటు వరంగల్.. ఖమ్మం.. రామగుండం.. దామచర్ల తదితర ప్రాంతాల నుంచి ఈ రైళ్లను నడపాలని నిర్ణయించారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వలస కూలీలకు అందేలా సమాచారం ఇవ్వాలని అధికారుల్ని ముఖ్యమంత్రి కోరారు. వలసల్ని తరలించే విషయంలో ఇప్పటికే కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవటం లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న వేళ.. అలాంటివాటికి టోకుగా చెక్ చెబుతూ కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయం సంచలనమే అవుతుందన్న మాట వినిపిస్తోంది.