‘న‌కిలీ ఓట్ల‌తోనే రేవంత్ గెలిచారు’

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ ర‌క్ష‌ణ‌సేన(టీఆర్ఎస్‌) పార్టీ అధ్యక్షురాలు క‌విత తీవ్ర వ్యాఖ్య లు చేశారు. న‌కిలీ ఓట్ల‌తోనే రేవంత్ విజ‌యం ద‌క్కించుకున్నార‌ని అన్నారు. కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో 33 వేల‌ న‌కిలీ ఓట్లు ఉన్నాయ‌ని.. రేవంత్ రెడ్డికి 32 వేల ఓట్ల మెజారిటీ ల‌భించింద‌ని.. అంటే.. ఆయ‌న న‌కిలీ ఓట్ల‌తోనే విజ‌యం ద‌క్కించుకున్న‌ట్టు క‌దా! అని క‌విత అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా న‌కిలీ ఓట్లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఆరోపించారు.

తెలంగాణ‌లో 2023లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో క‌ర్ణాటక‌ నుంచి నోట్ల‌తోపాటు ఓట్లు కూడా బ‌దిలీ అయ్యాయ‌నే అనుమానం ఉంద‌న్నారు. దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాల‌ని కేంద్ర ఎన్నిక‌ల‌ సంఘానికి క‌విత విజ్ఞ‌ప్తి చేశారు. గ‌త స‌ర్ ప్ర‌క్రియ‌లో కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో 800 ఓట్లు మాత్ర‌మే తొల‌గించార‌న్న ఆమె.. ప్ర‌స్తుతం 33 వేల న‌కిలీ ఓట్లు ఉన్నాయ‌ని చెప్పారు. దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న స‌ర్‌పైనా అనుమానాలు ఉన్నాయ‌ని తెలిపారు.

ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొ క్క విధంగా స‌ర్ ప్ర‌క్రియ‌ను చేప‌డుతున్నార‌ని తెలిపారు. ఈ తేడాను గ‌మ‌నించాల‌ని ఎన్నిక‌ల సంఘానికి ఆమె విజ్ఞ‌ప్తి చేశారు. హైదరాబాద్‌లో ఉన్న సెటిల‌ర్ల‌కు ఏపీలో కూడా ఓటు ఉందన్నారు. అయితే.. ఒక వ్య‌క్తికి ఒక ఓటు మాత్ర‌మే ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. న‌కిలీ ఓట్ల‌ను తొల‌గించ‌డం మంచిదేన‌ని.. అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. దీనిపై ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు.

కేసీఆర్ సంగ‌తేంటి: కాంగ్రెస్‌

సీఎం రేవంత్ రెడ్డిపై క‌విత చేసిన విమ‌ర్శ‌ల‌కు కాంగ్రెస్ పార్టీ కౌంట‌ర్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి సంగ‌తిని బాగా చెబుతున్న క‌విత‌.. త‌న అన్న కేటీఆర్‌, తండ్రి కేసీఆర్ నియోజ‌క‌వ‌ర్గాల గురించి కావాల‌నే మ‌రిచి పోయారా? అని ప్ర‌శ్నించారు. అక్క‌డ కూడా న‌కిలీ ఓట్లు ఉన్నాయ‌ని త‌మ నాయ‌కులు చెబుతున్నార‌ని.. వాటిని ప్ర‌శ్నించ‌రా? అని నిల‌దీయ‌డం గ‌మ‌నార్హం. కాగా, ప్ర‌స్తుతం రాష్ట్రంలో స‌ర్ ప్ర‌క్రియ జోరుగా సాగుతోంది. బూత్ లెవిల్ అధికారులు ఇంటింటికీ ప‌త్రాలు పంపిణీ చేస్తున్నారు.