‘వందేమాత‌రం’ పూర్తిగా పాడం: రాష్ట్రాల అల్టిమేటం

మ‌రో నాలుగు రోజుల్లో దేశ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాల‌కు లేఖలు రాసింది. స్వాతంత్య్ర వేడుక‌ల సంద‌ర్భంగా.. నిర్వ‌హించే అన్ని ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లోనూ వందేమాత‌రం గేయాన్ని సంపూర్ణంగాఆల‌పించాల‌ని.. అలా చేయ‌ని వారిపై కేసులు న‌మోదు చేయాల‌ని కూడా పేర్కొంది. ఈ మేర‌కు.. కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌కు కూడా ఆదేశాలు ఇచ్చింది.

వందేమాత‌రంలోని మొత్తం 6 చ‌ర‌ణాల‌ను రాగ‌యుక్తంగా ఆల‌పించాల‌ని కేంద్ర హోం శాఖ స్ప‌ష్టం చేసింది. దీనిని ఎలా ఆల‌పించాల‌న్న‌ది రేడియో మాధ్య‌మం వేదిక‌గా కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారులు నిర్వ‌హిస్తార‌ని.. దానిని అనుసరించాల‌ని కూడా తెలిపింది. కాగా.. ఈ ఆదేశాల‌ను,.. క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, కేర‌ళ, పంజాబ్ స‌హా.. ప‌లు రాష్ట్రా లు తిర‌స్క‌రించాయి. ఇప్ప‌టి వ‌రకు వందేమాత‌రం ఏరూపంలో ఉందో అలానే తాము ఆల‌పిస్తామ‌ని.. దీనికి మించి అవ‌స‌రం ఉంద‌ని తాము భావించ‌డం లేద‌ని ఆయా రాష్ట్రాలు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

ముఖ్యంగా కేర‌ళ‌లో కొత్త‌గా ఏర్ప‌డిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం.. కేంద్రం ఇచ్చిన ఆదేశాల‌ను కొట్టిపారేస్తున్న‌ట్టు పేర్కొంది. అంతేకాదు.. వందేమాత‌రం పూర్తిగా పాడ‌క‌పోయినంత మాత్రాన దానిపై గౌర‌వం లేద‌ని ఎవ‌రూ భావించ‌ర‌ని.. జాతీ య జెండాను ఎగుర‌వేయ‌నంత మాత్రాన ఈ దేశంలో పౌరులు ఈ దేశానికి చెందిన వారు కాద‌ని చెప్ప‌గ‌ల‌రా అంటూ .. కేర‌ళ మంత్రి ఒక‌రు ప్ర‌శ్నించారు. ఇక‌, త‌మిళ‌నాడులో విజ‌య్ ప్ర‌భుత్వం కూడా.. వందేమాత‌రం.. ప్ర‌స్తుతం ఉన్న విధానంలోనే కొన‌సాగుతుంద‌ని.. ఆమేర‌కు పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు, కార్యాల‌యాల్లో ఆల‌పించాల‌ని స‌ర్క్యుల‌ర్ జారీ చేసింది.

క‌ర్ణాట‌క సీఎం శివ‌కుమార్ కార్యాల‌యం కూడా.. ప్ర‌స్తుతం ఉన్న రూపంలోనే వందేమాత‌రాన్ని ఆలపించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది. ప్ర‌స్తుతం ఉన్న రూపం అంటే.. వందేమాత‌రం మొత్తం 6 చ‌ర‌ణాలు. ఇప్ప‌టి వ‌ర‌కు తొలి ప‌ల్ల‌వి, 1 చ‌ర‌ణాన్ని మాత్ర‌మే ఆల‌పిస్తున్నారు. కానీ ఇటీవ‌ల పార్ల‌మెంటులో ప్ర‌వేశ పెట్టిన బిల్లు మేర‌కు.. ఇక‌, నుంచి వందేమాత‌రం మొత్తం గేయాన్ని అంటే.. ఆరు చ‌ర‌ణాల‌ను ఆల‌పించాల‌ని కేంద్రం ఆదేశించింది. దీనికి కొన్ని రాష్ట్రాలు విముఖ‌త వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.