బాలినేని శ్రీనివాసరెడ్డి… వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమీప బంధువు. జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డికి మరింత దగ్గరి బంధువు. ఈ బంధుత్వమే బాలినేనిని లీడర్ ను చేస్తే… దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఆయన ఏకంగా మంత్రి పదవిని దక్కించుకోగలిగారు. వైఎస్సార్ మరణం తర్వాత ఆయన కుమారుడిగా జగన్ ఎలా సాగితే.. బాలినేని కూడా అదే బాటన సాగారు.
అలాంటి బాలినేని ఇప్పుడు జనసేనలో కొనసాగుతున్నా… జగన్ తో గానీ, సుబ్బారెడ్డితో గానీ ఆయన తన సంబంధాలను తెంచుకుంటారా? కష్టమే కదా. అదే మాట ఇప్పుడు టీడీపీ కీలక నేత, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ నోట వినిపించింది. ఉండటానికి జనసేనలోనే ఉన్నా… బాలినేని ఇప్పటికీ జగన్ కోసం, వైసీపీ కోసమే పనిచేస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీని వీడిన బాలినేని… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరిపోయిన సంగతి తెలిసిందే. వైసీపీలో ఉన్నప్పుడూ బాలినేని… పవన్ అంటే ఎంతో అభిమానం చూపేవారు. రాజకీయాలకు అతీతంగా పవన్ అంటే అభిమానం పెంచుకున్న బాలినేని… ఎన్నికల్లో వైసీపీ ఓటమి, ఆపై వైసీపీ అధిష్ఠానం నుంచి ఛీత్కరింపులు ఎదుర్కొన్న బాలినేని నేరుగా జనసేనలో చేరిపోయారు. బాలినేని చేరికతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేనకు ఓ రేంజి ఫలితాలు వస్తాయన్న విశ్లేషణలు సాగాయి. ఈ విశ్లేషణలు నిజమో, కాదో తెలియక ముందే… బాలినేని ఇంకా వైసీపీ కోసమే పనిచేస్తున్నారన్న విమర్శలు వినిపించడం గమనార్హం.
ఇక దామచర్ల జనార్ధన్ విషయానికి వస్తే.. టీడీపీ దివంగత నేత దామచర్ల ఆంజనేయులు మనవడిగా రాజకీయాల్లోకి వచ్చిన జనార్ధన్… బాలినేనికి ఏమాత్రం తీసిపోని నేతగా ఎదిగారు. ఇంకా చెప్పాలంటే… ఒంగోలు అసెంబ్లీలో బాలినేని కంటే కూడా జనార్దన్ కే బలం ఎక్కువ అని చెప్పాలి. అప్పటిదాకా రాజకీయ శత్రుత్వం నేపథ్యంలో టీడీపీ మిత్రపక్షం జనసేనలోకి వచ్చి చేరినా బాలినేనితో జనార్దన్ కు పెద్దగా కుదరలేదనే చెప్పాలి. కూటమిలో టీడీపీ రథసారధిగా ఉంటే..జనసేన మరో కీలక భాగస్వామిగా కొనసాగుతున్నాయి. ఈ రెండు పార్టీలకు చెందిన జనార్దన్, బాలినేనిల మధ్య నిత్యం ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుండటం గమనార్హం.
ఇక ప్రస్తుత వివాదం విషయానికి వస్తే..ఒంగోలుపై తన పట్టు నిలుపుకునేందుకు బాలినేని ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. ఈ క్రమంలోనే జనార్దన్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఇటీవల బాలినేని వర్గం నుంచి విమర్శలు వినిపించాయి. ఈ వ్యవహారంలో ఆదివారం బరస్ట్ అయిపోయిన జనార్దన్… బాలినేని తీరుపై నిప్పులు చెరిగారు.
బాలినేని ఉండటం అయితే జనసేనలోనే అయినా ఆయన పనిచేస్తున్నది వైసీపీ కోసమేనని జనార్దన్ సంచలన ఆరోపణలు గుప్పించారు. తనపై బాలినేని వర్గం ఏకంగా కరపత్రాలు పంపిణీ చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి మిత్రధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని తాను సంయమనం పాటిస్తున్నానని.. లేదంటే బాలినేనిపై కరపత్రాలు కాకుండా పుస్తకాలే పంపిణీ చేసేవాడినని ఆయన అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates