ఫ్లాప్ బాధ్యత తీసుకోవడం చాలా అవసరం  

ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే ఏదైనా సినిమా ఫ్లాప్ అయ్యిందంటే దానికి సాకులు వెతికే దర్శకులే ఎక్కువగా ఉన్నారు. ఫలానా కాంపిటీషన్ వల్ల మాది చూడలేదనో, నిర్మాతలు ప్రమోషన్స్ చేయకపోవడం వల్ల రీచ్ కాలేదనో ఇలా ఏవేవో కారణాలు చెప్పడం నిత్యం చూస్తుంటాం. దానికి భిన్నంగా అజయ్ భూపతి స్పందించారు. శ్రీనివాస మంగాపురంలో జయకృష్ణ, రశ తదాని నటనను మెచ్చుకుంటూ ఫలితానికి తనదే జవాబుదారి అని, తర్వాతి మూవీలో మళ్ళీ రుజువు చేసుకుంటానని ట్వీట్ చేశారు.

ఇది ఆహ్వానించాల్సిన విషయం. ఎందుకంటే పరాజయం ఎవరికైనా ఏదో ఒక టైంలో వస్తుంది. దాన్ని ఒప్పుకున్నప్పుడు తర్వాత ఎలాంటి తప్పులు చేయకూడదో క్లారిటీ వస్తుంది. శ్రీనివాస మంగాపురం జయకృష్ణని ఒక మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసే ఉద్దేశంతో రాయించిన కథ. ఈ తరహా రెగ్యులర్ ఫార్ములా అజయ్ భూపతి లాంటి వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. ఆరెక్స్ 100, మంగళవారం ఆదరణ పొందాయంటే దానికి రీజన్ వేరు. కొత్త తరహా ట్రీట్ మెంట్, డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో జనాన్ని మెప్పించారు.

శ్రీనివాస మంగాపురంకు ఎన్నో పొరపాట్లు జరిగాయి. మోహన్ బాబు లాంటి సీనియర్ మోస్ట్ స్టార్ కటవుట్ ని సరిగా వాడుకోలేదు. ఆయనసలు ప్రమోషన్లలో కూడా కనిపించలేదు. రెండు వర్గాల మధ్య పగలు ప్రతీకారాలు కాన్సెప్ట్ ఎప్పుడో అరిగిపోయింది. దాన్ని తీసుకోవడం ఇంకో రాంగ్ డెసిషన్. రిలీజ్ టైమింగ్ కూడా తప్పే. నేరుగా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేతో క్లాష్ కావడం దారుణంగా దెబ్బ కొట్టింది. జివి ప్రకాష్ కుమార్ పాటలు సైతం ఛార్ట్ బస్టర్స్ అనిపించుకోలేదు.

ఇవన్నీ విశ్లేషించుకుంటే నెక్స్ట్ ఎక్కడెక్కడ జాగ్రత్త పడాలో జయకృష్ణ, అజయ్ భూపతి ఇద్దరికీ క్లారిటీ వస్తుంది. మళ్ళీ ఈ కాంబో సాధ్యం కాకపోవచ్చేమో కానీ ఇకపై ఎలాంటి ప్లానింగ్ ఉండాలనే దానికి శ్రీనివాస మంగాపురం ఒక పాఠంగా ఉపయోగపడుతుంది. అజయ్ భూపతి మంగళవారం 2 తీసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈసారి థ్రిల్, హారర్ డోస్ మరింత పెంచి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇచ్చేలా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట. అదయ్యాక అనౌన్స్ మెంట్ రావొచ్చు.