ఈసారి అసెంబ్లీకి రాకపోతే కష్టమే జగన్

రాష్ట్ర శాసన సభ 7వ సమావేశాలు ఈ నెల 17 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎమ్మెల్యేలకు, ప్రభుత్వ శాఖలకు నోటిఫికేషన్ ప్రతులను పంపించారు. అమరావతి లోని అసెంబ్లీ హాలులో జరిగే సమావేశాలకు సంబందించి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షుత జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పని దినాలు, ఎజెండా ఖరారు చేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సహచర మంత్రులకు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.

అయితే ఈసారైనా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్న చర్చ జరుగుతుంది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గైర్హాజరు అవుతున్నారు. ఈ విషయం మీద రాష్ట్రంలోని రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరిగింది.

జగన్ వైఖరి ప్రజా తీర్పును అవమానించే విధంగా వుందని మేధావులు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యను చర్చించడానికి అసెంబ్లీ ఒక్కటే సరైన వేదిక అన్నది నగ్న సత్యం. ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తానంటూ జగన్ మొదటినుంచి మొండికేస్తున్నారు. ఆయన చేస్తున్న వింత వాదనకు రాష్ట్రంలోని ఇతర పార్టీల నుంచి కానీ ప్రజల నుంచి కానీ సానుకూల స్పందన రాలేదు. కోర్టు మెట్లు ఎక్కినప్పటికి నిరాశ ఎదురైంది. దాంతో కొంత కాలంగా ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడ్డం మానేశారు.

ఈమధ్య ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళన కార్యక్రమం విజయవంతం కావడంతో జగన్ ఆలోచనల్లో మార్పు వచ్చింది. యువతను ఆకట్టుకునేందుకు డీఎస్సీలో అక్రమాలు జరిగాయని, దానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఎలాగూ ఈ అంశం మీద రచ్చ జరిగే అవకాశం వుంది. దాని సాకుతో మళ్ళీ అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసి డుమ్మా కొట్టొచ్చని ఆలోచన చేస్తున్నట్లు జగన్ కోటరీ గుసగుసలాడుకుంటున్నారు

జగన్ 2025 ఫిబ్రవరి 24 తేదిన సభకు హాజరయ్యారు. ఆ తర్వాత 2026 ఫిబ్రవరి 11 తేదీన గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యారు. కేవలం 10 నిముషాలు మాత్రమే సభలో వున్నారు. యధాతధంగా వాకౌట్ చేసి వెళ్లిపోయారు. అయితే ఏ సభ్యుడైనా అసెంబ్లీకి వరసగా 60 రోజులపాటు హాజరుకాకపోతే అతడి మీద అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం జగన్ మీద వేటు పడే అవకాశం వుంది. దీన్నుంచి తప్పించుకునేందుకు రేపటి వర్షాకాల సమావేశాలకు హాజరు కావాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.