నానాజీ వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారు?

వైసీపీ నేత‌ల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇదేస‌మ‌యంలో కొన్ని కీలక వ్యాఖ్య‌లు కూడా చేశారు. ఇటీవ‌ల కాకినాడ సిటీ ఎమ్మెల్యే, జ‌న‌సేన నాయ‌కుడు పంతం నానాజీ మాజీ సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ స్పందించారు. నానాజీ చేసిన వ్యాఖ్య‌ల‌ను తాను స‌మ‌ర్థించ‌బోన‌న్న ఆయ‌న‌.. ఇదేస‌మ‌యంలో ఆ ప్రాంతానికే చెందిన వైసీపీ నాయ‌కులు నీతిమంతంగానే రాజకీయాలు చేస్తున్నారా? అని ప్ర‌శ్నించారు.

ముఖ్యంగా మ‌హిళ‌ల‌ను ఎంతకు దిగ‌జారి దూషించారో.. సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణే ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణగా పేర్కొన్నారు. రాష్ట్రంలోనే కాకుండా.. రాష్ట్రేత‌ర ప్రాంతాల్లో ఉన్న మ‌హిళ‌ల‌ను కూడా వైసీపీ నాయ‌కులు దూషించార‌ని, ఇలాంటి వాటిని తాను స‌హించేది లేద‌ని తేల్చి చెప్పారు. ఈ క్ర‌మంలో వైసీపీ నేత‌, మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్య‌ల‌పై కూడా ప‌వ‌న్ స్పందించారు. ప‌వ‌న్ స‌హా జ‌న‌సేన నాయ‌కులు ఎన్ని తిట్టినా స్పందించ‌వద్దు అంటూ నాని త‌న పార్టీ నాయ‌కుల‌కు సూచించారు.

ఈ విష‌యంపై ప‌వ‌న్ మాట్లాడుతూ.. మీరు ఎన్ని అన్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు భ‌రించాం. ఇప్పుడు మీరు తిట్ట‌మ‌ని చెబుతున్నారు. చూస్తాం. మీరు ఎంత రియ‌లైజ్ అయ్యారో. అయినా.. మీరు తిట్టినంత మాత్రాన జ‌న‌సేన బ‌లోపేతం కాద‌ని.. తిట్టినా.. తిట్ట‌క‌పోయినా జ‌న‌సేన పునాదులు బ‌లంగానే ఉన్నాయి. అని వ్యాఖ్యానించారు. మీరు మెత్తగా ఉండాలి కానీ.. మరీ మౌనంగా ఉంటే చేతకానితనంగా చూస్తారు. అని పార్టీ నాయ‌కుల‌కు ఆయ‌న సూచించారు. తాజాగా శ‌నివారం మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో నిర్వ‌హించిన స‌మావేశంలో ప‌వ‌న్ మాట్లాడారు.

వైసీపీ నాయ‌కులు అధికారంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడారని, ఇప్పుడు కూడా అలానే వ్య‌వ హ‌రిస్తున్నార‌ని చెప్పారు. 11కాదు.. ఒకే ఒక్క స్థానానికి ప‌డిపోయినా వైసీపీ నేత‌లు మార‌బోరు అని ప‌వ న్ వ్యాఖ్యానించారు. కానీ.. జ‌న‌సేన మాత్రం ప్ర‌శ్నిస్తూనే ఉంటుంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. వైసీపీ నేత‌ల తాట‌తీస్తాన‌న్న వ్యాఖ్య‌ల‌ను క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని.. మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేవారిని ఉపేక్షించేది లేద‌ని తెలిపారు. అదేస‌మ‌యంలో రాష్ట్రంలో అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని.. సంక్షేమం అనేది అవ‌స‌ర‌మైన వారికి మాత్ర‌మే అందాల‌నేది జ‌న‌సేన అభిప్రాయ‌మ‌ని చెప్పుకొచ్చారు.