వైసీపీ నేతల విమర్శల్లో ఉపయోగించిన భాషపై జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. మీకు అధికారం ఉన్నప్పుడు మీరు ఇష్టానికి తిట్టేసి ఇప్పుడు జ్ఞానోదయం కలిగిందా.. ? అంటూ ఆయన ప్రశ్నించారు.
జనసేన పార్టీ, వైసిపి నేతల మధ్య కొంతకాలంగా ఘాటు విమర్శలు కొనసాగుతున్నాయి. తమ పార్టీ అధినేత జగన్ ను జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దూషించారంటూ వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కార్యాచరణ సమావేశంలో ఈరోజు పవన్ కళ్యాణ్ ఆ అంశంపై స్పందించారు.
నానాజీ మాటలను తాను ఎంకరేజ్ చేయనని అంటూనే వైసీపీ నేతలు గతంలో ఉపయోగించిన భాషపై పవన్ కళ్యాణ్ గట్టిగానే మాట్లాడారు.
పాలసీ పరంగా మాట్లాడితే వైసీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలు చెయ్యడం, వ్యక్తిత్వ హననం చేసినప్పుడు గట్టిగా సమాధానం ఇవ్వక తప్పదు అన్నారు. మౌనంగా ఉన్నాం అని ఒక్కోసారి పేట్రేగిపోతారు. కాబట్టి మనం కూడా కొన్ని సందర్భాల్లో ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు సూచించారు.
అధికారం పోయినా, 11 సీట్లకే పరిమితం అయినా ఇంకా ఇష్టానికి నోటికొచ్చినట్టు దూషిస్తున్నారు. అది గొప్పతనం మీలో.. మీ కమిట్మెంట్ ను అభినందిస్తున్నానని పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులను ఉద్దేశించి సెటైర్లు వేశారు. 11 వచ్చినా భాష విషయంలో మేము తగ్గం అంటున్నారు. తగ్గకండి మీకు 1 వచ్చినా తగ్గకండి అలాగే ఉండండి ఆయన అన్నారు. మీరు మమ్మల్ని తిట్టకుండా ఉంటే మా పార్టీ నిర్మాణానికి చాలా సమయం ఉంటుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates