దేశంలోని చాలా నగరాలల్లో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. మెట్రో సేవలు కలిగిన రాష్ట్రాల జాబితాలోకి త్వరలో ఏపీ కూడా చేరబోతోంది. ఇతర రాష్ట్రాల్లో కేవలం ఒక ఒకటి, అరా నగరాల్లోనే మెట్రో సేవలు కొనసాగుతుంటే.. ఏపీలో ఏకంగా రెండు నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలలో మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్ లకు కేంద్రం ఆమోద ముద్ర పడే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్థిక మదింపును కేంద్రం ప్రారంభించింది. అంటే…ఈ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని చెప్పవచ్చు.
తెలుగు నేల విభజన తర్వాత విభజిత ఏపీలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ… 2015లోనే విజయవాడతో పాటుగా విశాఖలో మెట్రో సేవల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలపై నాడు ఓ మోస్తరు అడుగులు పడినా… 2019లో టీడీపీ ఓడిపోవడం, వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ ప్రాజెక్టులు కాస్తా అటకెక్కేశాయి. అయితే 2024 ఎన్నికల్లో జనసేన, బీజేపీలతో కలిసిన టీడీపీ… తిరిగి అధికారం చేజిక్కించుకుంది. అంతేకాకుండా అటు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు, ఇటు ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు కొలువు దీరడంతో… సీఎం నారా చంద్రబాబునాయుడు మరోమారు మెట్రో ప్రాజుక్టుల బూజు దులిపారు.
విజయవాడ, విశాఖల మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్ లను రూపొందించిన కూటమి సర్కారు.. వాటిని కేంద్రం పరిశీలనకు పంపింది. ఈ ప్రతిపాదనలపై దృష్టి సారించిన కేంద్రం… ఇటీవలే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక మదింపును ప్రారంభించింది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే… ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోద ముద్ర పడనుంది. ఆ వెంటనే విజయవాడ, విశాఖల్లో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ కూడా ప్రారంభం కానుంది. వెరసి అతి త్వరలోనే ఈ రెండు నగరాల్లో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయన్న మాట. రెండు నగరాల్లో మొత్తంగా 84.63 కిలో మీటర్ల మేర మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వస్తాయి.
ఇక విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు విషయానికి వస్తే..పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం, పెనమలూరు దారా తొలి దశ మెట్రో రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బందరు రోడ్డు, ఏలూ రోడ్డు, గన్నవరం, పెనమలూరుల్లో భూసేకరణకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. నగరంలో 38.40 కిలో మీటర్ల మేర ఏర్పాటు కానున్న మెట్రో ప్రాజెక్టుకు రూ.10,118 కోట్ల నిధులు అవసరం కానున్నాయి. బస్టాండ్ నుంచి గన్నవరం, పెనమలూరుల వరకు రెండు మార్గాల్లో మెట్రో ఏర్పాటు కానుంది.
విశాఖ మెట్రో విషయానికి వస్తే… నగరంలో మూడు మార్గాల్లో 46.22 కిలో మీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. డబుల్ డెక్కర్ మోడ్ లో ఈ వ్యవస్థ ఏర్పాటు కానుంది. మూడు మార్గాల్లో కలిపి 43 మెట్రో స్టేషన్లు ఉంటాయి. ఇందుకోసం రూ.11,498 కోట్ల నిధులు అవసరం కానున్నట్లుగా డీపీఆర్ లో పేర్కొన్నారు. ఇక ఈ మెట్రో స్టీల్ ప్లాంట్, గాజువాక, ఎన్ఏడీ, తాటిచెట్లపాలెం, గురుద్వారా, మద్దిలపాలెం, హనుమంతువాకల్లో ఇంటిగ్రేటెడ్ మెట్రో స్టేషన్లు ఏర్పాటు కానుండగా… కొమ్మాది వరకూ మెట్రో ఏర్పాటు కానుంది.
రెండు ప్రాజెక్టులకు కలిపి మొత్తంగా రూ.21,616 కోట్ల మేర నిధులు అవసరం కానున్నాయి. ఈ నిధుల్లో రాష్ట్రం వాటా 20 శాతం కాగా…కేంద్రం కూడా తన వంతుగా మరో 20 శాతం నిధులను అందించనుంది. ఇక మిగిలిన 60 శాతం నిధులను ఆయా ఆర్థిక సంస్థల నుంచి రుణం రూపేణా సేకరించే దిశగా డీపీఆర్ రెడీ అయ్యింది. ఏపీలో కొనసాగుతున్న పారిశ్రామిక ప్రగతి, అమరావతి అభివృద్దిలను పరిశీలిస్తున్న పలు ప్రైవేట్ అంతర్జాతీయ సంస్థలు మెట్రో ప్రాజెక్టులో నిధులు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వెరసి త్వరలోనే ఏపీలో రెండు ప్రాజెక్టులు ఒకేసారి పట్టాలెక్కనున్నాయని చెప్పవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates