తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాదించిన పార్టీగా బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్)కు ఓ ప్రత్యేక గుర్తుంపు అయితే ఉంది. అయినంత మాత్రాన కొత్త తెలంగాణను పదేళ్ల పాటు పాలించిన ఆ పార్టీ ప్రభుత్వం తప్పులేమీ చేయలేదా? అంటే.. ఎందుకు చేయలేదు. చాలానే చేసింది. తప్పులు జరిగాయి. పొరపాట్లూ జరిగాయి. ఇదేదో బీఆర్ఎస్ వ్యతిరేకులో, బీఆర్ఎస్ అంటే గిట్టని వారో చెబుతున్న మాట ఎంతమాత్రం కాదు. సాక్షాత్తు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కీలక మంత్రిగా చక్రం తిప్పిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావే ఈ మాట చెప్పారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత రాష్ట్రాన్ని పదేళ్ల పాటు బీఆర్ఎస్సే పాలించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పాలనలో లెక్కలేనన్ని పొరపాట్లు, తప్పిదాలు జరిగాయన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన ప్రశ్న పత్రాల లీకేజీలు, ఇంటర్ బోర్డు వాల్యూయేషన్ లో మితిమీరిన నిర్లక్ష్యం ఫలితంగా చాలా మంది విద్యార్థుల ఆత్మహత్యలు, రాజకీయ నేతల ఫోన్ల ట్యాపింగులు, ప్రాజెక్టుల్లో అవినీతి పరంపర… ఇలా చాలానే విమర్శలు వినిపించాయి.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే తరహా అంశాలపై వచ్చిన ప్రశ్నలకు కేటీఆర్ స్పందించారు. తమ పార్టీ ప్రభుత్వ హయాంలో తప్పులేమీ జరగలేదని తాను చెప్పడం లేదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వంలోనూ చాలా తప్పులే జరిగాయన్నారు. తామూ చాలానే తప్పులు చేశామని కూడా ఆయన పేర్కొన్నారు. తమను తాము దైవాంశ సంభూతులుగా చెప్పుకోవడం లేదని, తామూ మానవ మాత్రులమేనని ఆయన అన్నారు.
తమ పాలనలో జరిగిన తప్పులను ప్రస్తావించిన కేటీఆర్…. టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలకు సంబందించిన ప్రశ్నాపత్రాల లీకేజీని గుర్తు చేసుకున్నారు. నాడు టీఎస్పీఎస్సీలోని కొందరి ద్వారా జరిగిన తప్పు తమ మెడకు చుట్టుకుందని ఆయన అన్నారు. నాడు ప్రశ్నాపత్రాలు లీక్ అయిన వెంటనే అందుకు బాధ్యులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని ఆయన అన్నారు.
తప్పు చేసిన నాటి టీఎస్పీఎస్సీ బోర్డును పీకి పారేసి ఉంటే.. నిరుద్యోగుల్లో తమ పట్ల ఈ మేర ఆగ్రహం గూడుకట్టుకుని ఉండేది కాదని ఆయన అన్నారు. నాడు టీఎస్పీఎస్సీని పీకి పారేయని కారణంగా… ఆ తప్పు తమది కానప్పటికీ… తామే బాధ్యులుగా నిలవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. మొత్తంగా కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates