దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల దూకుడుకు మరింతగా బ్రేకులు వేయాలని భావిస్తున్నారా? అంటే .. తాజాగా జరుగుతున్న పరిణామాలు ఔననే సమాధానమే ఇస్తున్నాయి. ఇటీవల ఎన్నికలు జరిగిన.. ఐదు రాష్ట్రాల్లో కీలకమైన తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లలో ప్రభుత్వ పార్టీలు ఓడిపోయాయి. ఈ క్రమంలో బెంగాల్‌లో బీజేపీ సర్కారు ఏర్పడింది.
దీంతో బెంగాల్‌లో 80 స్థానాలు దక్కించుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నందిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. దీని వెనుక బీజేపీ మంత్రాంగం ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇక, తమిళనాడులోనూ ఇదే తరహా వ్యూహాత్మక సన్నివేశాలు ఖాయమని అంచనా వేస్తున్న డీఎంకే .. జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉన్న 57 మంది ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకుంటోంది. ఇలా.. పలు రాష్ట్రాల్లో బీజేపీ దెబ్బకు ప్రాంతీయ పార్టీలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయని.. జాతీయస్థాయిలో చర్చ జరుగుతోంది.
మరోవైపు.. మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పట్టు మరింత బిగించే ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికలకు ముందు.. బలైమన శివసేన పార్టీని చీల్చిన విషయం తెలిసిందే. ఈ పార్టీ కీలక నాయకుడిగా ఉన్న ఏక్‌నాథ్ షిండేతో తిరుగుబాటు జెండా ఎగరేయించి.. శివసేనను ముక్కలు చేశారు. ఆ తర్వాత.. బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక, వచ్చే ఎన్నికలకు సంబంధించి.. ఇప్పటి నుంచే ఆపరేషన్ టైగర్ పేరుతో శివసేనను మరింత వీక్ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తోంది.
చీలిపోయిన శివసేనకు సంబంధించి ఉద్ధవ్ థాక్రే నివాసంలో శివసేన(UBT) నేతల భేటీ ఆదివారం జరిగింది. అయితే.. ఈ సమావేశానికి ముగ్గురు ఎంపీలు దూరంగా ఉండడం.. వారు బీజేపీ వైపు దృష్టి పెట్టడం వంటివి చర్చకు దారితీశాయి. బెంగాల్ మాదిరి ఆపరేషన్ టైగర్ జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. అయితే.. శివసేన మాత్రం తమ నేతలందరూ తమతోనే ఉన్నారని ప్రకటించింది.
కానీ, చిత్రంగా.. ఈ సమావేశానికి రాని ఎంపీలు… బీజేపీ నేత ఇంట్లో విందుకు హాజరు కావడం గమనార్హం. మరోవైపు.. ఇప్పటికే కోరలు ఊడిపోయి.. ఇబ్బందిలో ఉన్న శివసేన మాత్రం గాండ్రింపులు మానలేదు. మేం అధికారంలోకి వస్తే బీజేపీ ఉనికిలో ఉండదు. బీజేపీ నేతలు ఇళ్ల నుంచి కూడా బయటకు రాలేరు. అని ఆ పార్టీ నాయకుడు సంజయ్‌రౌత్ వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates