ఢిల్లీలో ‘జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం’ పేరుతో 3 రోజుల పాటు సభలను నిర్వహించాలని జనసేన నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సభలకు తొలిరోజు హాజరైన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ సమైక్యత కోసం ఈ సభలను ఢిల్లీలో నిర్వహిస్తున్నామని పవన్ చెప్పారు. ఈ క్రమంలోనే కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)పై పవన్ విమర్శలు గుప్పించారు.
జాతీయ వాదాన్ని పక్కనపెట్టి, చిన్న చిన్న అభిప్రాయాలు, కురచ భావాలు, వ్యక్తిగత లాభాలతో వ్యవహరించే వ్యక్తుల వల్లే కాక్రోచ్ జనతా పార్టీల వంటివి పుట్టుకొస్తోన్నాయని పవన్ అన్నారు. దేశ సమగ్రతను బలి చేసేందుకు కొన్ని శక్తులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ఆలోచన ప్రవాహంలో చిక్కుకోకూడదనే భావనను తెలియజేసేందుకే ఈ సభను ఢిల్లీలో ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.
చిన్న చీమలు కూడా బలమైన సర్పాన్ని చంపేస్తాయన్న సుమతీ శతకం గుర్తుకు వచ్చిందని అన్నారు. చాలామంది చిన్న చిన్న శక్తులు కలిస్తే …మంచైనా, చెడైనా అది బలంగా ఉంటుందని అన్నారు. ఆ ప్రవాహంలో జనసేన చిక్కుకోకూడదనే ఈ సభ పెట్టానని చెప్పారు. విభజన వాదం బలపడకూడదు అన్న విషయం చాటిచెప్పేందుకు ఈ సభను ఢిల్లీలో నిర్వహించామని తెలిపారు. జనసేనకు జాతీయ సమగ్రత, దేశభక్తి చాలా కీలకమని పవన్ అన్నారు. విభజనవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని జనసైనికులకు పవన్ పిలుపునిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates