కేంద్రప్రభుత్వం రూపొందించిన మూడు నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రమంత్రులతో జరిపిన చర్చలు మళ్ళీ ఫెయిలయ్యాయి. తదుపరి చర్చలు జనవరి 4వ తేదీన జరిపేందుకు నిర్ణయమైంది. ఇఫ్పటికే అటు కేంద్రమంత్రులకు ఇటు రైతు సంఘాలకు మధ్య ఐదుసార్లు చర్చలు జరిగిన విషయం తెలిసిందే. చర్చలు ఎప్పుడు జరిగినా విఫలమయ్యాయే కానీ ఒక్కసారి కూడా ఏ విషయంలో కూడా ఏకాభిప్రాయం రాలేదు. అందుకే తాజాగా జరిగిన చర్చలు కూడా ఫెయిలయ్యాయి.
కేంద్రమంత్రులతో చర్చలు పదిసార్లు కాదు కదా ఇంకో వందసార్లు సమేవశమైనా ఉపయోగం ఉండదని తేలిపోయింది. ఎందుకంటే రైతుసంఘాలు చర్చలు జరపాల్సింది కేంద్రమంత్రులతో కానేకాదు. కేవలం ప్రధానమంత్రి నరేంద్రమోడితో చర్చలు జరిపితే మాత్రమే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో. మూడు చట్టాల అములు విషయంలో బాగా పట్టుదలతో ఉన్నది కేవలం ప్రధానమంత్రి మాత్రమే. మిగిలిన మంత్రులంతా కేవలం నిమ్మిత్తమాత్రులే అన్నది అందరికీ తెలిసిందే.
కేంద్రం తాజాగా చేసిన చట్టాలు మూడు కూడా అంబానీలు, అదానీలాంటి వాళ్ళకు మాత్రమే ప్రయోజనకరమని రైతుసంఘాలు గడచిన 37 రోజులుగ ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రైతులకు ఎటువంటి ప్రయోజనం లేని చట్టాలను వెంటనే రద్దు చేయాలంటూ పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, రాజస్ధాన్ రాష్ట్రాల్లోని రైతుసంఘాలు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నాయి. వేలాదిమంది రైతులు హర్యానా-ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘూ ప్రాంతంలో గుడారాలేసుకని మరీ ఉద్యమం చేస్తున్నారు.
మామూలుగా కొత్తగా తయారైన చట్టాలు ఏదో మంత్రుల స్ధాయిలో రూపొందుంటే ఉద్యమసెగకు ఈపాటికే రద్దయ్యేవేమో. కానీ స్వయంగా మోడినే బాగా ఇంట్రస్టుగా ఉండటం వల్లే చట్టాల రద్దు సాధ్యం కావటం లేదు. రైతులేమో చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రమేమో చట్టాల్లో సవరణలు మాత్రమే చేస్తామని చెబుతోంది. దీనివల్లే చర్చలు ప్రతిసారి ఫెయిలవుతున్నాయి.
చట్టాలను రద్దు చేయాలనే నిర్ణయం తీసుకోవాల్సింది కేవలం నరేంద్రమోడి మాత్రమే. ఆ విషయం బాగా తెలుసుకాబట్టే చర్చల్లో పాల్గొంటున్న మంత్రులెవరు చట్టాల రద్దుపై మాట్లాడేందుకు ఎటువంటి ఆసక్తి చూపటం లేదు. రైతులేమో చట్టాల రద్దుపైన మాత్రమే చర్చించేందుకు పట్టుబడుతున్నారు. అందుకనే ఇన్ని రోజులైనా చర్చల్లో ఎటువంటి పురోగతి కనబడటం లేదు. కాబట్టి రైతుసంఘాలు తమ చర్చలను మోడితో మాత్రమే చేస్తే ఉపయోగం ఉంటుందేమో ఆలోచించాలి. లేకపోతే ఎంతకాలం ఉద్యమం జరిగినా అంగుళం కూడా పురోగతి ఉండదన్నది వాస్తవం.