డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే – అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. సీఎం రేవంత్ రెడ్డి రోజుకు 18 గంట‌ల‌పాటు ప‌నిచేస్తున్నారని.. గ‌త ముఖ్య‌మంత్రి మాదిరిగా రెండు గంట‌లు ప‌నిచేసి 22 గంట‌లు.. రెస్టు తీసుకోలేద‌ని వ్యాఖ్యానించారు. మంగ‌ళ‌వారం జ‌న‌గామ జిల్లాలో ప‌ర్య‌టించిన భ‌ట్టి.. ప‌లు అభివృద్ధికార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. అనంత‌రం.. ఆయ‌న స‌భ‌లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్‌కు భారీ డోస్ ఇచ్చారు.

ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌డం.. ఫామ్ హౌస్‌లో రాజ‌కీయాలు చేయ‌డం త‌మ‌కు తెలియ‌ద‌ని భ‌ట్టి విమ‌ర్శించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను తాము సంపూర్ణంగా అమ‌లు చేస్తున్నామ‌న్నారు. అయినా త‌మ‌పై రాళ్లేస్తున్నార‌ని అన్నారు. రాష్ట్ర విభ‌జ‌న స‌క్ర‌మంగా జ‌ర‌గ‌లేద‌ని అంటున్న వారిపై కూడా.. భ‌ట్టి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో తెలంగాణ‌కు అన్యాయం జ‌ర‌గలేద‌న్నారు. ధ‌నిక రాష్ట్రంగా తెలంగాణ‌ను ఇచ్చార‌ని తెలిపారు.

అయితే.. ప‌దేళ్ల బీఆర్ఎస్ పాల‌న‌లో ధ‌నిక రాష్ట్రాన్ని.. అప్పుల పాలు చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను అన్ని విధాలా మోసం చేసి.. ఇప్పుడు ఫామ్ హౌస్‌లో ప‌డుకుంటున్నార‌ని మాజీ సీఎం కేసీ ఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రాన్ని కుటుంబ రాజ‌కీయాల‌కు ప‌రాకాష్ఠ‌గా మార్చిన ఘ‌న‌త కేసీఆర్‌కే ద‌క్కుతుంద‌న్నారు. త‌న కుటుంబంసంక్షేమ‌మే ప‌దేళ్లూ చూసుకున్నార‌ని విమ‌ర్శించారు. రైతుల స‌మస్య‌ల‌పై ప్ర‌శ్నించిన వారిపై ఉక్కుపాదం మోపార‌ని అన్నారు. ఉద్యోగ వ‌ర్గాల‌ను కూడా అన్యాయం చేశార‌ని విమ‌ర్శించారు.

స‌మ‌స్య‌ల‌తో పోరాడుతున్నాం..

రాష్ట్ర ప్ర‌భుత్వం అనేక స‌మ‌స్య‌ల‌తో పోరాడుతోంద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి వ్యాఖ్యానించారు. గ‌త ప్ర‌భుత్వం అప్పులు పెట్టి వెళ్లినా.. సంక్షేమాన్ని, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేస్తున్నామ‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వంనుంచి త‌మ‌కు ఎలాంటి స‌హ‌కారం ఉండ‌డం లేద‌న్న భ‌ట్టి.. ఇక్క‌డి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న బీజేపీ నాయ‌కులు కూడా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌పై స్పందించ‌డం లేద‌ని దుయ్య‌బ‌ట్టారు.