ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. జనసేన పార్టీ అధినేతగా పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు. తాజాగా తొలిసారి ఒకే సమయంలో ఇద్దరు నేతలుకూడా విశాఖలో పర్యటించారు. సోమవారం సాయంత్రం విశాఖలోని స్టీల్‌ప్లాంట్ జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మృతి చెందడం తో పాటుపలువురు గాయపడ్డారు. వీరిని పరామర్శించేందుకు ఇరువురు నాయకులు విశాఖలో పర్యటించారు.
రెస్ట్ పక్కన పెట్టి..
రష్యా పర్యటనకు వెళ్లిన.. మంత్రి నారా లోకేష్.. ఈ రోజు ఉదయమే.. హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన విదేశీ పర్యటన బడలికతో మంగళవారం రెస్ట్ తీసుకోవాలని, కుటుంబ సభ్యులతో గడపాలని అనుకున్నారు. కానీ, విశాఖలో జరిగిన దుర్ఘటనతో ఆయన ఉదయం 10 గంటలకే హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖకు చేరుకున్నారు. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కూడా మంగళగిరి నుంచి నేరుగా విశాఖకు చేరుకుని.. బాధితులను పరామర్శించారు.
పని విభజన..
విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితుల పరామర్శకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌లు వచ్చినా.. ఇద్దరూ ఎలాంటి గందరగోళానికి తావివ్వకుండా.. పనిని పంచుకున్నట్టు స్పష్టమైంది. మంత్రి లోకేష్.. నేరుగా ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లారు. వారితో మాట్లాడి.. ఓదార్చారు. వారితో కలిసి కూర్చుని వారి బాధను పంచుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం నూరిపోశారు.
ఇక, పవన్ కల్యాణ్.. మంగళగిరి నుంచి నేరుగా విశాఖకు చేరుకున్నా.. అక్కడి నుంచి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వైద్యశాలలో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లారు. వారిని పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యాన్ని, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులతో నేరుగా మాట్లాడి వారి నుంచి కొంత సమాచారం తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు.
ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. కాగా.. ఇరువురు నేతలు.. వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. నిజానికి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నాన్ ప్లాన్‌గా వ్యవహరించే పరిస్థితి ఉంటుంది. కానీ, పవన్, లోకేష్‌లు బాధితుల పరామర్శలో భాగం అయ్యే విషయంలో జాగ్రత్తలు తీసుకుని విమర్శలకు తావులేకుండా వ్యవహరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates