వైసీపీలో హాట్ టాపిక్‌: ఈ నియోజ‌క‌వ‌ర్గాల మాటేంటి ..!

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో కొంద‌రు నాయ‌కులు పోటీ చేసిన నియోజ‌క‌వ‌ర్గాల్లో వారు ఓడిపోయారు. అయితే.. ఆ త‌ర్వాత ప‌లువురు నేత‌లు.. పార్టీ మారారు. అలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్ప‌టికీ వైసీపీ రాజకీయాలు ఒకదారికి రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితిని స‌రిదిద్దాల‌న్న సూచ‌న‌లు వ‌స్తున్నా.. ఇప్ప‌టికీ.. పార్టీ అధిష్టానం ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇప్పుడు వాటి ప‌రిస్థితి ఏంట‌నేది వైసీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

జ‌గ్గ‌య్య‌పేట‌.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసిన సామినేని ఉద‌య‌భాను.. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇక్క‌డ వైసీపీ త‌ర‌ఫున పెద్ద‌గా ప‌ట్టించుకునే నాయ‌కులు క‌నిపించ‌డం లేదు. ఇది పార్టీకి.. స్థానిక కేడ‌ర్‌కు కూడా ఇబ్బందిగానే మారింది. తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు నియోజ‌కవ‌ర్గం నుంచి పోటీ చేసిన గొల్ల‌ప‌ల్లి సూర్యారావు కూడా ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దిలేశారు. ఇక్క‌డ కూడా పార్టీ ఇబ్బందులు ప‌డుతోంది.

గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలో కూడా వైసీపీకి ఎదురు గాలి వీస్తోంది. మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి.. మేక‌తోటి సుచ‌రిత గ‌త ఎన్నిక‌ల్లో తాడికొండ నుంచి పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు. ఆ తర్వాత‌.. ఆమె.. తిరిగి ప్ర‌త్తిపాడుకు వెళ్లిపోయారు. కానీ, దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌లేక పోతున్నార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. పైగా.. ఆమె పార్టీ మార్పుపై కొన్నాళ్ల కింద‌టే చ‌ర్చ వ‌చ్చినా.. మౌనంగా ఉన్నారు. ప్ర‌స్తుతం పార్టీ కార్యక్ర‌మాల‌కు కూడా దూరంగా ఉంటున్నారు.

విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌లోనూ.. ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. గ‌త ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌చ్చి ఇక్క‌డ చ‌క్రం తిప్పిన అప్ప‌టి మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌.. తిరిగి త‌న నియోజ‌క‌వ‌ర్గానికి చేరిపోయారు. దీంతో సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ టాక్ ఎక్క‌డా వినిపించ‌డం లేదు. ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. పార్టీ మాటే వినిపించ‌డం లేదు. ఇలా ప‌దుల సంఖ్య‌లో నియోజ‌క‌వ‌ర్గాలు వైసీపీకి ఇబ్బందిగా ఉన్నాయి. దీంతో ఏదైనా చేయాల‌ని.. నాయ‌కుల‌ను నియ‌మించాల‌ని నేత‌లు కోరుతున్నారు.