ఫాం హౌస్‌లో కేడీ-ఢిల్లీలో మోడీ!

ఫాం హౌస్‌లో కేడీ- ఢిల్లీలో మోడీ.. ఎవ‌రు ఎన్ని కుట్ర‌లు ప‌న్నినా.. తెలంగాణ‌లో అభివృద్ధిని ఆప‌లేరు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కేడీ….. మోడీల‌తో.. యుద్ధం చేస్తున్నామ‌ని అన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడ‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోంద‌న్నారు. ఇప్పుడు రంగారెడ్డి, హైద‌రాబాద్ స‌హా ప‌లు జిల్లాల్లో భూముల ధ‌ర‌లు పెరుగుతున్నాయ‌న్నారు. ఎంత‌మంది అడ్డుకున్నా.. రాష్ట్ర అభివృద్ధి జ‌రుగుతుంద‌ని తెలిపారు.

త‌న‌ను రాజీనామా చేయాల‌ని బీజేపీ నాయ‌కులు కోరుతున్నార‌ని.. అయితే, తానేమీ ఊరికేనే ముఖ్య‌మంత్రి కాలేద‌ని తొక్కుకుంటూ వ‌చ్చామ‌న్నారు. తెలంగాణ స‌మాజం ఓటేస్తే.. ముఖ్య‌మంత్రి అయ్యామ‌న్నారు. కేంద్రం వ‌రి కొనుగోలు విష‌యంలో అడ్డ‌గోలుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని చెప్పారు. కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజ‌య్‌, కిష‌న్ రెడ్డిల‌కు బాధ్య‌త లేదా? అని ప్ర‌శ్నించారు. ఈ నెల 15 లోగా వ‌డ్ల‌ను కొనుగోలు చేయాల్సిందేన‌ని.. కొనిపిస్తామ‌ని ఉద్ఘాటించారు.

రాష్ట్రంలో ఒక‌ప్పుడు.. రేష‌న్ కార్డు కోసం క‌న్నీళ్లు పెట్టుకున్నా.. క‌నిక‌రించ‌ని పాల‌కులు ఉన్నార‌ని కానీ.. తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇంటింటికీ తిరిగి అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ కార్డులుమంజూరు చేశామ‌న్నారు. ఇప్పుడు త‌మ‌కు రేష‌న్ కార్డులేద‌న్న కుటుంబాలు ఒక్క‌టి కూడా లేద‌న్నారు. సంక్షేమాన్ని- అభివృద్ధి క‌లిపి.. జోడెడ్ల మాదిరిగా ముందుకు తీసుకువెళ్తున్నామ‌ని రేవంత్ రెడ్డి వ్యాక్యానించారు. ఫాం హౌస్ రాజ‌కీయాలు చేసేవారు.. ఫామ్ హౌస్‌కే ప‌రిమితం అయ్యార‌ని మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

2034 వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంద‌ని రేవంత్ చెప్పారు. 2004 నుంచి 2014 వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంద‌ని.. ఆ త‌ర్వాత ప‌దేళ్ల పాటు బీఆర్ఎస్ ఉన్నా.. ఏమీ ఒరిగింది లేద‌న్నారు. సామాన్యుల క‌ష్టాలు ప‌ట్టించుకున్న దిక్కులేకుండా పోయింద‌న్నారు. 2024లోఅధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ రెండున్న‌రేళ్ల‌లోనే ప్ర‌జ‌ల క‌ష్టాలు తీర్చేదిశ‌గా అడుగులు వేసింద‌న్నారు. 2034 వ‌ర‌కు కాంగ్రెస్‌కు తిరుగులేద‌ని.. ప్ర‌తి ఇంటా.. ప్ర‌తి నోటా కాంగ్రెస్ మాటే వినిపిస్తోంద‌న్నారు. నాడు ప‌దేళ్లు విధ్వంసం చేస్తే.. నేడు రెండున్న‌రేళ్ల‌లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం అని రేవంత్ అన్నారు.