ఇంటింటికీ కూట‌మి.. ఏం చెబుతారు… ?

ఈ నెల 25 నుంచి టీడీపీ వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది. ఇంటింటికీ.. పేరుతో ఓ కార్య‌క్ర‌మానికి సీఎం చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా.. ప్ర‌తి ఎమ్మెల్యే, ఎంపీ కూడా.. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని ఆయ‌న నిర్దేశించారు. అంతేకాదు.. తాను కూడా వ‌స్తాన‌ని తేల్చి చెప్పారు. ఇక్క‌డితో కూడా ఆగ‌కుండా.. అంద‌రూ సైకిల్‌నే వినియోగించాల‌ని.. సాధార‌ణ సైకిల్ అయితే మంచిద‌ని.. అలా కాక‌పోతే ఎల‌క్ట్రిక్ సైకిల్ అయినా.. వాడాల‌ని సూచించారు తాను కూడా సైకిల్‌పైనే ప్ర‌జ‌ల‌ను క‌లుస్తాన‌న్నారు.

రెండు ల‌క్ష్యాలు..
ఇంటింటికీ కార్య‌క్ర‌మం ద్వారా సీఎం చంద్ర‌బాబు రెండు ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకున్నారు.
1) నేత‌ల్లో యాక్టివిటీని పెంచ‌డం: నేత‌ల్లో యాక్టివిటీని పెంచాల‌ని చంద్ర‌బాబు గ‌త కొన్నాళ్లుగా క‌స‌ర‌త్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. కొంద‌రు మాత్ర‌మే రియాక్ట్ అవుతున్నారు. మ‌రికొంద‌రు మాత్రం మౌనంగా ఉంటున్నారు. ఇప్పుడు మాత్రం ఇంటింటికీ కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌తిఒక్క‌రూ యాక్టివ్ అవుతార‌న్న‌ది చంద్ర‌బాబు ఆలోచ‌న‌గా ఉంది.

2) ప్ర‌భుత్వం చేస్తున్న మంచిని ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డం. : వాస్త‌వానికి ఈ కార్య‌క్ర‌మం నిరంత‌రాయంగా జ‌ర‌గుతూనే ఉంది. ప్ర‌స్తుతం ఇస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు.. పెట్టుబడులు, ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ఇలా అనేక అంశాల‌పై చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. కాక‌పోతే.. ఇప్పుడు ప్ర‌తి ఇంటికీ వెళ్లి క‌ర‌ప‌త్రాలు అందించి.. చేసిన మంచిని మ‌రింత ప్ర‌చారం చేయాల‌న్న‌ది చంద్ర‌బాబు వ్యూహం. దీనికి సంబంధించి స‌మ‌గ్రంగా ఆయ‌న నేత‌ల‌కు వివ‌రించారు.

నేతలు చెప్పాలా.. ప్ర‌జ‌లు చెప్పాలా..?

అయితే.. చంద్ర‌బాబు ఏం ఆలోచ‌న చేశారో తెలియ‌దు కానీ.. ప్ర‌భుత్వం ఏర్ప‌డి రెండు సంవ‌త్స‌రాలు పూర్త‌వుతున్న ద‌రిమిలా.. స‌ర్కారు చేసిన మంచిని ప్ర‌జ‌లే ప్ర‌స్తావిస్తే బాగుంటుంద‌న్న చ‌ర్చ ఉంది. అలా కాకుండా.. నేత‌లే ప్ర‌జ‌ల మ‌ధ్య‌కువెళ్లి.. మేం అది చేశాం ఇది చేశాం అంటే.. అతిశ‌యోక్తిగా మారుతుంద‌ని అంటున్నారు.

గ‌తంలో వైసీపీ కూడా ఇంటింటికీ ఎమ్మెల్యే పేరుతో కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది. కానీ, అది స‌క్సెస్‌కాలేదు. పోనీ.. ఆస‌మ‌యంలో వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌నైనా ప‌రిష్క‌రించారా ? అంటే లేదు. ఈ నేప‌థ్యంలో టీడీపీ చేప‌డుతున్న ఇంటింటి కార్య‌క్ర‌మంలో చేసింది చెప్ప‌డంతోపాటు.. ప్ర‌జ‌ల మాట కూడా వింటే.. దానిని పాటిస్తే.. మెరుగైన ఫ‌లితం వ‌స్తుంద‌ని అంటున్నారు.