తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు తెలంగాణలో రాజకీయ కాక రేపాయి. తనను తెలంగాణలో, హైదరాబాద్ లో అడుగుపెట్టనివ్వబోమని బెదిరిస్తున్నారని, వాటికి భయపడబోనని పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ క్రమంలోనే పవన్ వ్యాఖ్యలకు తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు.
మిస్టర్ పవన్ కల్యాణ్ తెలంగాణ మా అయ్య జాగీరే.. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల జాగీరే అంటూ పవన్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ మాటల్లో అహంకారం కనిపించిందని, తెలంగాణపై పవన్ కు ఇంత అక్కసు ఎందుకని పొన్నం ప్రశ్నించారు. పవన కల్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్ అని ఎద్దేవా చేశారు.
4 నెలల క్రితం ప్రభుత్వం గెస్టుగా పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించామని, అప్పుడే మరిచిపోయారా అని ప్రశ్నించారు. ఆంధ్రాలోనే గెలవలేని పవన్ కల్యాణ్ తెలంగాణలో ఏం చేస్తారని నిలదీశారు.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయొద్దని పొన్నం ప్రభాకర్ హితవు పలికారు.
ఆఫ్ట్రాల్ పవన్ మీటింగ్ పెడితే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందా అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి విమర్శించారు. ఆ సభకు అనుమతినివ్వకపోవడం ప్రభుత్వ వైఫల్యం అని ఆరోపించారు. కాంగ్రెస్, పవన్ కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు చేస్తున్న డ్రామా ఇది అని ఆరోపించారు. పీకుతా..అంటూ పవన్ మాట్లాడడం సరికాదని, ఆయన ఇంత ఆవేశపడాల్సిన అవసరం లేదని అన్నారు.
పవన్ సినిమా డైలాగులు మాట్లాడడం సరికాదని హితవు పలికారు. పవన్ ఎదుగుదల తెలంగాణ ప్రజల దయాదాక్షిణ్యం అని, పవన్ ను ఎవరో ఏదో అన్నారని మొత్తం తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా పవన్ మాట్లాడడం సరికాదని అన్నారు. పవన్ ను విమర్శించిన వారి గురించి ఆయన మాట్లాడాలని, వారి పేరెత్తకుండా ఎవరినో ఉద్దేశించి పవన్ మాట్లాడుతున్నారని అన్నారు.
అమిత్‌షాపై పవన్ కు ప్రేముంటే గుజరాత్‌లో పోటీచేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత హైదరాబాద్‌లో పవన్ ఎన్ని రోజులు ఉన్నారో, ఏపీలో ఎన్ని రోజులు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ నరదిష్టి వల్లే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయాయని పవన్ ఇందుకోసమే మాట్లాడారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. తిరుపతికి వెళ్లి హుండీలో వేసిన డబ్బుల గురించి కూడా చెప్పుకుంటామా? అని ప్రశ్నించారు.
కొండగట్టుకు టీటీడీ నిధులు ఇచ్చిన పవన్ దాని గురించి పబ్లిసిటీ చేయడం సరికాదని అన్నారు. ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ ఫ్లాప్ అయిన డిప్రెషన్‌లోనే పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని అనిరుధ్ రెడ్డి సెటైర్లు వేశారు.
అయితే ఇవన్నీ పవన్ మాట్లాడిన నిమిషాల వ్యవధిలో వచ్చిన కౌంటర్లు కావడం గమనార్హం. ఈ వివాదం ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది… ఎప్పటికి ఆగుతుంది అర్ధం కావడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates