తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ చిచ్చు రాజుకుందా…?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ పై ఓ రేంజి తరహా వ్యాఖ్యలు చేసిన రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రాజుకునేలా చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఓ రాజకీయ విశ్లేషకుడు అన్నాక… సమగ్ర వివరాలను తెలుసుకుని మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.

అలా కాకుండా ఓ పార్టీని నిలువునా ముంచేసేలా చేసే వ్యాఖ్యలను ఏ ఒక్కరూ హర్షించరు. ఈ దిశగానే నాగేశ్వర్ వ్యవహారం సాగగా… ఇప్పుడు తెలంగాణకు చెందిన అధికార పార్టీ కాంగ్రెస్ తో పాటుగా అక్కడి విపక్ష పార్టీలూ కొన్ని ఏపీ నాయకుల పట్ల విద్వేషాలను రెచ్చగొడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాయి. వీటిన్నింటినీ చూస్తుంటే.. రెండు రాష్ట్రాల మధ్య తిరిగి చిచ్చు రాజుకుందా? అన్న అనుమానాలు కలగక మానవు.

నాగేశ్వర్ వ్యవహారం ఇలా సద్దుమణిగిందో లేదో… అలా పవన్ కల్యాణ్ కోడి చెరువు భూములను ఆక్రమించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల మాట ఎలా ఉన్నా… త్వరలోనే తెలంగాణలో నవ నిర్మాణ సభ ఏర్పాటు చేసే దిశగా పవన్ అడుగులు వేయడంతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది.

ఏపీకి చెందిన పార్టీకి తెలంగాణతో ఏం పని అని తెలంగాణ నేతలు గళం విప్పారు. ఈ దిశగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత, మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం మీడియా ముందుకు వచ్చి పవన్ పై సంచలన ఆరోపణలు గుప్పించారు. పవన్ తెలంగాణ జోలికి వస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.

ఓ వైపు పొన్నం మీడియా సమావేశం ముగిసినంతనే తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రంగంలోకి దిగిపోయారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ రాజకీయ నాయకులకు ఏజెంట్ గా మారిపోయారని ఆరోపించిన ఆమె… బీఆర్ఎస్ అదికారంలో ఉన్నప్పుడు ఏపీ నాయకులు భయపడేవారని తెలిపారు.

కాంగ్రెస్ పాలన వచ్చాక తెలంగాణపై ఏపీ నాయకులు బహిరంగంగానే విద్వేశపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎక్కడ పడితే అక్కడ ఏపీ నాయకుల విగ్రహాలు పెడుతున్నారని ఆరోపించిన ఆమె… తాము అదికారంలోకి వచ్చినంతనే ఆ విగ్రహాలను పీకేసి ఏపీకి పార్సిల్ చేస్తామని సంచలన వ్యాఖ్య చేశారు.

ఏపీ నేతలు తెలంగాణకు రావచ్చు, పోవచ్చునన్న కవిత.. రోయ్యలు అమ్ముకోవచ్చు, సినిమా షూటింగ్ లు చేసుకుని వెళ్లవచ్చని కూడా వ్యాఖ్యానించారు. చనువు ఇచ్చాం గదా అని తెలంగాణ సచివాలయంలో కూర్చుని తెలంగాణలో చక్రం తిప్పుతామంటే మాత్రం చూస్తూ ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు. మొత్తంగా నాగేశ్వర్ వ్యవహారం, ఆ తర్వాత పవన్ సభ.. తదనంతర పరిణామాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మద్య మరోమారు చిచ్చు రాజుకుందన్న వాదనలు అయితే బలంగానే వినిపిస్తున్నాయి.