ఏపీలో రెండు రోజుల క్రితం ఓ కీలక అదికారిక కార్యక్రమం జరిగింది. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేసిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మోదీతో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో పాటు కేంద్రం, రాష్ట్ర కేబినెట్ల నుంచి పలువురు కీలక మంత్రులు, కూటమి పార్టీల నేతలు హాజరయ్యారు. విజయనగరం జిల్లా వాసి, టీడీపీ మాజీ నేత, ప్రస్తుత గోవా గవర్నర్ పూసపాటి అశోక గజపతిరాజు సైతం ఈ వేడుకలో కనిపించారు. డిప్యూటీ సీఎం పవన్ పక్కనే ఆయన కూర్చుని కనిపించారు. ఇద్దరి మనస్తత్వాలు దాదాపుగా ఒకటేనన్న వాదన వినిపిస్తున్నా…గతంలో వారిద్దరి మధ్య నెలకొన్న రాజకీయ విమర్శలను గుర్తు చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు రచ్చ జరుగుతోంది.
పవన్ కల్యాణ్ ది సాటి మనిషి కష్టాల్లో ఉంటే చూసి తట్టుకోలేని మనస్తత్వం. రాజుల వంశానికి చెందిన అశోక గజపతి రాజుదీ అదే మనస్తత్వం. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తుల్లో మెజారిటీ ఆస్తులను ఆయన దానం చేసేశారు. మన్సాస్ పేరిట ఓ సంస్థనే ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఏళ్ల తరబడి రాజు గారి కుటుంబం అదే బాధ్యతలను నెరవేరుస్తూనే ఉంది. పవన్ సైతం తనకు వీలయినంత మేర ప్రజలకు సేవ చేసేందుకూ ఏనాడూ వెనుకాడలేదనే చెప్పాలి. ఈ విషయంలో పవన్ చేతికి ఎముకన్నదే లేదన్న మాట కూడా చాలాసార్లు వినిపించింది. డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ సేవలు మరింతగా విస్తరించాయి.
ఈ క్రమంలో పవన్, రాజుగారు కలిస్తే.. దాన గుణం కలిగిన ఇద్దరు నేతలు కలిశారని అంతా సంతోషించాలి. దానిని పక్కనపెట్టేసిన కొందరు వ్యక్తులు గతంలో పవన్, రాజు గారి మధ్య కొనసాగిన రాజకీయ విభేదాలను తెర మీదకు తీసుకుని వచ్చి మరీ సోషల్ మీడియా వేదికల మీద పోట్లాడుకుంటున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు గానీ, శాశ్వత మిత్రులు గానీ ఉండరన్న విషయం తెలిసిందే కదా. రాజు గారు టీడీపీలో కొనసాగితే… పవన్ సొంతంగానే జనసేన పేరిట పార్టీ పెట్టుకున్నారు. గతంలో ఈ రెండు పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలు కొనసాగాయి. ఆ సందర్భంగా పవన్ ఎవరో తనకు తెలియదని రాజు గారు అంటే…నా పేరు పవన్ కల్యాణ్ అంటూ పవన్ విజయనగరం వేదికగానే గళమెత్తి వినిపించారు.
కట్ చేస్తే… యాక్టివ్ పాలిటిక్స్ కు రాజు గారు గుడ్ బై చెప్పేశారు. కూటమి పార్టీల మధ్య మైత్రితో ఆయనకు గవర్నర్ పదవి దక్కింది. వెరసి రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిగానే రాజు గారిని పరిగణించాలి. ఇక పవన్ జనసేన అదినేత నుంచి ఏపీ డిప్యూటీ సీఎం దాకా ఎదిగారు. తనదైన శైలి పనితీరుతో ఏపీ ప్రజలనే కాకుండా యావత్తు దేశ ప్రజలను ఆకట్టుకుంటూ సాగుతున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా రాజు గారు, పవన్ ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. వయసులో పెద్ద వారైన రాజు గారు… తన పెద్దరికాన్ని నిలబెట్టుకుంటూ తన పక్కన కూర్చున్న పవన్ ను పలకరించారు. చేతికి కట్టుతో వచ్చిన పవన్ ఆరోగ్యంగా గురించి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. తను పక్కకు వెళ్ళి పవన్ ను చంద్రబాబు పక్కన కూర్చోబెట్టారు.
ఈ ఫొటోలు చూసినంతనే అటు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, జన సైనికులు గానీ… ఇటు ఉత్తరాంధ్ర జనం, టీడీపీ సానుభూతి పరులు హర్షం వ్యక్తం చేయాల్సి ఉంది. అయితే దానిని విడిచిపెట్టిన ఈ రెండు వర్గాలు… పవన్, రాజుగారి మధ్య గతంలో జరిగిన ఘటనలను పరస్పరం గుర్తు చేసుకుంటూ సాగుతున్నారు. ఈ తరహా విచిత్ర వైఖరిపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా నాడు విమర్శించుకున్నా… నేడు వాటిని మరిచిపోయి పవన్, రాజు గారు ఆప్యాయంగా పలకరించుకుంటే.. ఈ రెండు వర్గాలకు పోయిందేమిటి? అనే వాదన ఆసక్తి రేకెత్తిస్తోంది. గడచిన మూడు రోజులుగా ఇదే అంశంపై చర్చ అవసరమా? అన్న కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఈ రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టండి అంటూ సలహాలు, సూచనలూ వస్తున్నాయి. మరి ఈ రచ్చ ఇప్పటికైనా సద్దుమణుగుతుందని ఆశిద్దాం.
Gulte Telugu Telugu Political and Movie News Updates
