‘బీజేపీ ఆడమన్నట్టు పవన్ అడుగుతున్నారు’

జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు గుప్పించారు. నవ నిర్మాణ సమితి పేరిట పవన్ చేయనున్న కార్యక్రమాల గురించి ప్రస్తావించిన పొన్నం… సోమవారం ఏకంగా మీడియా ముందుకు వచ్చి మరీ పవన్ పై ఓ రేంజిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ ఆటలు తెలంగాణలో చెల్లనివ్వబోమని ఈ సందర్భంగా ఆయన హెచ్చరికలు జారీ చేశారు.

పవన్ రాజకీయ నాయకుడిగా మారకముందు…మారిన తర్వాత కూడా తన సినీ జీవితాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావించిన పొన్నం…సినీ నటుడిగా పవన్ వ్యక్తిగత జీవితం తనకు అవసరం లేదని ప్రకటించారు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే యత్నం చేశారని ఆయన పవన్ పై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీసేలా వ్యవహరించారని ఆరోపించారు. ఇప్పుడేమో కొత్తగా నవ నిర్మాణ సమితి పేరిట పవన్ తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తున్నారని, దీనిని తాము సహించబోమని హెచ్చరించారు.

గూట్లో రాయి తీయలేనోడు..ఏట్లో రాయి తీశాడన్నట్లుగా పవన్ వైఖరి ఉందని పొన్నం సెటైర్లు సంధించారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఏపీలో ఏదైనా మంచి పని చేయాలని… ఏమైనా పీకగలిగితే అక్కడ పీకాలని ఆయన పవన్ కు సూచించారు. అది వదిలేసి తెలంగాణ వైషమ్యాలను రెచ్చగొట్టే దిశగా ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని కూడా పొన్నం వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన వైనాన్ని జీర్ణించుకోలేక పవన్ 11 రోజుల పాటు అన్నం తినలేదని, ఈ మాట పవనే చెప్పారంటూ పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక తెలంగాణతో పవన్ కేం పని అని ప్రశ్నించిన పొన్నం… బీజేపీ ఆడమన్నట్లుగా పవన్ ఆడుతున్నారని ఆరోపించారు. పనన్ సహజంగా ఓ నటుడు అని పేర్కొన్న పొన్నం… డబ్బులు ఇస్తే పవన్ ఏమైనా చేస్తారన్నారన్నారు. పైసలు ఇస్తే పవన్ ఏ నటన చేయమంటే ఆ నటన చేస్తారని, ఏ డ్రస్సు వేయమంటే ఆ డ్రెస్సు వేస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇక తెలంగాణలో పవన్ నిర్వహించతలపెట్టిన నవ నిర్మాణ సభ తరహా సభలను ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ వద్ద రేటు మాట్లాడుకుని తెలంగాణలో అశాంతి రేకెత్తించే దిశగా పవన్ సాగుతున్నారని ఆయన ఆరోపించారు. మొత్తంగా పవన్ పై పొన్నం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.