1500 కోట్ల భూ క‌బ్జా కేసు.. ప‌రారీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

వైసీపీ అధికారంలో ఉండ‌గా.. ఆపార్టీకి చెందిన నాయ‌కులు అనేక అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా, భూముల నుంచి మైనింగ్ వ‌ర‌కు కూడా అనేక రూపాల్లో ప్ర‌జ‌ల ధ‌నాన్ని దోచుకున్నార‌న్న కేసులు కూడా న‌మోద‌య్యాయి. ఇప్ప‌టికే మ‌ద్యం, గ‌నులు, ఇసుక‌.. అక్ర‌మాల‌పై పెద్ద ఎత్తున విచార‌ణలు కూడా జ‌రుగుతున్నాయి. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ప‌ల్నాడు జిల్లా వినుకొండ‌కు చెందిన బొల్ల బ్ర‌హ్మ‌నాయుడు.. హైద‌రాబాద్‌లో ఏకంగా 1500 కోట్ల రూపాయ‌ల విలువ చేసే భూమిని క‌బ్జా చేసేందుకు ప్ర‌య‌త్నించార‌ని పోలీసులు తెలిపారు.

ఎక్క‌డ‌.. ఎంత‌..?

హైద‌రాబాద్‌లోని అత్యంత ఖ‌రీదైన ప్రాంతంగా ఉన్న గండిపేట‌లో సుమారు 15 వంద‌ల కోట్ల రూపాయ‌ల విలువైన భూమిని న‌కిలీ ప‌త్రాల‌తో కొట్టేసేందుకు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు స‌హా.. ఆయ‌నకు చెందిన వారే ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో రిజిస్ట్రేష‌న్‌కు కూడా స‌న్నాహాలు చేసుకున్నారు. అయితే.. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన గండిపేట త‌హ‌సీల్దార్‌.. రిజిస్ట్రేష‌న్‌ను నిలువ‌రించి.. పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ వ్య‌వ‌హారంపై.. శేరిలింగంప‌ల్లి డీసీపీ శ్రీనివాస్ ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు.

వైసీపీ హ‌యాంలో..

వైసీపీ హ‌యాంలోనే హైద‌రాబాద్లోని గండిపేటలో సర్వే నంబర్‌ 18లో ఉన్న భూమికి నకిలీ జీవోలు సృష్టించారు. ఈ క్ర‌మంలో నిమ్మల రాజేశ్‌ గౌడ్‌, వేణుగోపాల్‌, సాయికిరణ్‌ల పాత్ర ఉంది. వైసీపీ నేత‌ బొల్లా బ్రహ్మనాయుడు, ఆయ‌న సోద‌రుడు బొల్లా రమేశ్‌ల పాత్ర కూడా ఉంది. ప్రభుత్వమే త‌మ‌కు స‌ద‌రు భూమిని ఇచ్చింద‌ని పేర్కొంటూ.. న‌కిలీ జీవోలు సృష్టించారు. వీటి ఆధారంగా రిజిస్ట్రేష‌న్ చేయించేందుకు ప్ర‌య‌త్నించారు. వాస్త‌వానికి చట్టబద్ధ హక్కులు లేకుండానే.. ఆ భూమిని త‌మ‌కు బ‌ద‌లాయించుకుని త‌ర్వాత‌.. అమ్మేసేందుకు భారీ కుట్ర చేశారు. అంతేకాదు.. ఎక‌రం మూడున్న‌ర కోట్ల రూపాయ‌లకు విక్ర‌యించే ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.

ఈ క్ర‌మంలో విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌డంతో గ‌త కొన్నాళ్లుగా విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు.. ఈ అక్రమంలో 4 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు చేతులు మారినట్లు గుర్తించారు. స్వ‌యంగా వైసీపీనేత‌ బొల్లా ఖాతా నుంచే 2 సార్లు న‌గ‌దు బ‌దిలీ అయిన‌ట్టు తెలుసుకున్నారు. నార్సింగి పోలీసు స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేయ‌గా.. ఈ విష‌యం తెలిసిన బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు, ఆయ‌న సోద‌రుడు.. కూడా ప‌రార‌య్యార‌ని డీసీపీ తెలిపారు. అయితే.. వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు.