ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న రెండు పార్టీల మధ్య సమన్వయం సాధించే దిశగా పై స్థాయిలో మార్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇటు టిడిపిలోను అటు జనసేనను నాయకత్వాన్ని ముందుకు నడిపించేందుకు క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించేందుకు ఉమ్మడిగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించారు. దీనికి సంబంధించి మహానాడులో తీసుకున్న నిర్ణయం ప్రకారం అటు పసుపు సేన ఇటు జనసేన నాయకులను కార్యకర్తలను ముందుండి నడిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను ఈ కమిటీ నిర్ణయించనుంది.
దీని ప్రకారం క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల కార్యకర్తలను నాయకులను కూడా సమన్వయం చేయడంతో పాటు ఉమ్మడిగా కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వ ప్రాధాన్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లే విషయంలో నూ ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుంది. ఫలితంగా ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో కొంతమేరకు ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొంటున్న అనేక నియోజకవర్గాల్లో మార్పులు వస్తాయని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో కలిసికట్టుగా ప్రజల మధ్యకు వెళ్లడంతో పాటు ప్రజల సమస్యలను ప్రస్తావించి వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేసేందుకు ఈ ప్రయత్నం ఫలిస్తుందని భావిస్తున్నారు.
వాస్తవానికి ఇప్పటివరకు ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో గత ఎన్నికలకు ముందు ఉన్న కలివిడితనం ఈ రెండు పార్టీలలో ఇప్పుడు లోపిస్తోంది. నాయకుల మధ్య.. విభేదాలు వివాదాలు, కామన్ గా మారాయి. దీంతో వచ్చే ఎన్నికల వరకు వేచి చూస్తే ఇబ్బందికర పరిణామాలు తప్పవని భావించిన పార్టీలు ఉమ్మడిగా సమన్వయం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాజాగా మహానాడులో కూడా ఈ విషయంపై చర్చించారు.
ప్రధానంగా కలిసి ముందుకు సాగడం ద్వారా పార్టీలను బలోపేతం చేయడం ద్వారా మాత్రమే మళ్ళీ విజయం సాధించగలం అన్న బలమైన సంకేతాన్ని టిడిపి శ్రేణులకు పంపించినట్టు అయింది. సో ఈ క్రమంలోనే పసుపు సేన -జనసేన నాయకులు, కార్యకర్తలు మధ్య సమన్వయం కల్పించేందుకు కమిటీని ఏర్పాటు చేసి ప్రజల మధ్య కు వెళ్లేందుకు అవకాశం కలిపించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇది సక్సెస్ అయితే ఇక క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వంతో పాటు కార్యకర్తలను నడిపించేందుకు అవకాశం కూడా ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates