తెలంగాణ ఏర్పడ్డాక.. తొలిసారి.. ఎన్టీఆర్ విగ్రహం

ప్రాంతాలు వేరైనా.. మన అంతరంగం ఒకటేనన్నా.. అంటూ ప్రాంతాల విభేదాలను పక్కన పెట్టి తెలుగువారంతా కలిసి ఉండాలని కోరుకున్న నాయకుడు.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిన నేత అన్నగారు ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలంగాణ నడిబొడ్డున మైత్రీవనంలో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆవిష్కరించారు.

అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు 12 సంవత్సరాలకు అన్నగారి విగ్రహం ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుమారులు రామకృష్ణ, మోహన్‌కృష్ణతో పాటు ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు కూడా పాల్గొన్నారు.

ఆదిలో ఏపీ నాయకులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నాయకులు కూడా తాజాగా మౌనంగా ఉండిపోయారు. పైగా ఎన్టీఆర్ సెంటిమెంట్‌ను బీఆర్ఎస్ కూడా నమ్ముకున్న నేపథ్యంలో ప్రస్తుత విగ్రహ ఆవిష్కరణ విషయంలో మౌనంగా ఉండిపోయింది.

కాగా గత ఏడాది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో విజయం దక్కించుకున్న తర్వాత ఎమ్మెల్యే ప్రోత్సాహంతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన జయంతిని పురస్కరించుకుని అమీర్‌పేట్ మైత్రీవనం సర్కిల్‌లో ఏర్పాటు చేశారు. ఒకరకంగా తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు ఇదే తొలిసారి.