పొలిటికల్ ఎంట్రీ నుండి రజనీకాంత్ బ్యాక్ స్టెప్ వేయటం వల్ల మిగిలిన రాజకీయపార్టీలు చాలా హ్యాపీగా ఫీలవుతున్నాయట. పార్టీల్లో కూడా ముఖ్యంగా డీఎంకే నేతలు మాత్రం ఫుల్లుగా ఖుషీగా ఉన్నారు. ఎందుకంటే తమిళనాడులో మే లో షెడ్యూల్ ఎన్నికలు జరగాలి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమదే విజయం అన్నంత ఊపులో ఉన్నారు డీఎంకే నేతలు.
ఇలాంటి సమయంలో హఠాత్తుగా కొత్త రాజకీయపార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు రజనీకాంత్ చేసిన ప్రకటన పెద్ద బాంబులాగ పేలింది. ముఖ్యంగా అధికార ఏఐఏడీఎంకే, ప్రధాన ప్రతిపక్షంలో డీఎంకేల్లో. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తామే గెలుస్తామంటు ఏఐఏడిఎంకే నేతలు చెప్పుకుంటున్నారు. కాదు కాదు తమదే విజయమని డీఎంకే నేతలు కూడా మంచి దూకుడుమీదున్నారు.
క్షేత్రస్ధాయిలోని సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావటానికి డీఎంకేకు ఎక్కువ అవకాశాలున్నాయట. ఎందుకంటే పోయిన ఎన్నికల్లో జయలిలత పుణ్యమా అని ఏఐఏడిఎంకే అధికారంలోకి వచ్చింది. అయితే తర్వాత జయలలిత మరణించిన విషయం తెలిసిందే. జయ మరణంతో పార్టీలో చాలా గొడవలే జరిగాయి. ఏదో సర్దుబాటు చేసుకుని అధికారంలో కంటిన్యు అవుతున్నారు కానీ ఓ దశలో ప్రభుత్వం కూలిపోతుందనే ప్రచారం కూడా జరిగింది.
వచ్చే ఎన్నికల్లో జనాలను ఆకట్టుకునేంత సీన్ ప్రస్తుత ఏఐఏడిఎంకే నేతల్లో ఎవరి కూడా లేదన్నది వాస్తవం. ఇదే సమయంలో డీఎంకే చీఫ్ స్టాలిన్ మాత్రం ఇప్పటికే నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపికను కూడా దాదాపు పూర్తి చేసేశారని ప్రచారం జరుగుతోంది. అంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బరిలోకి దూకటానికి రెడీగా ఉంది డీఎంకే.
ఇటువంటి సమయంలోనే హఠాత్తుగా రజనీ తన పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రకటించారు. దాంతో డీఎంకే ఒక్కసారిగా షాక్ తిన్నదనే చెప్పాలి. పొలిటికల్ ఎంట్రీతో రజనీ అధికారంలోకి వచ్చేది లేనిది కచ్చితంగా చెప్పలేకపోయినా తమ విజయావకాశాలకు దెబ్బ తప్పదని డీఎంకే నేతల్లో టెన్షన్ మొదలైందట. అందుకనే పొలిటికల్ ఎంట్రీ నుండి బ్యాక్ స్టెప్ అన్న రజనీ ప్రకటనతో డీఎంకే నేతలు హ్యాపీగా ఫీలవుతున్నారట. దాదాపు నెలరోజుల టెన్షన్ ఒక్కసారిగా తీసేసినట్లు ఫీలవుతున్నారట.
Gulte Telugu Telugu Political and Movie News Updates