స్టాలిన్ ఎస్ అంటే ఏపీకి నష్టమా?

తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగానే అక్కడ రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. దశాబ్దాలుగా డీఎంకేతో కలిసి సాగుతున్న కాంగ్రెస్ పార్టీ.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకేకు మద్దతునిస్తూ ప్రభుత్వంలో భాగస్వామిగా మారడాన్ని డీఎంకే అధినేత స్టాలిన్ జీర్ణించుకోలేకపోయారు.

శత్రువుకు శత్రువు మిత్రుడు అయినట్లుగా.. టీవీకే, కాంగ్రెస్ ఒక్కటైన నేపథ్యంలో ఆ రెండు పార్టీలు వ్యతిరేకించే బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమితో చేతులు కలపడానికి స్టాలిన్ రెడీ అయినట్లు భావిస్తున్నారు. డీఎంకేకు లోక్‌సభలో 22 మంది, రాజ్యసభలో 8 మంది ఎంపీలు ఉన్నారు. కాబట్టి ఆ పార్టీ వస్తే ఎన్డీయే కూటమి బలపడుతుంది.

ఇటు లోక్‌సభలో, అటు రాజ్యసభలో బిల్లులు పాస్ చేసుకోవడం కొంచెం తేలిక అవుతుంది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ముందుకు తీసుకెళ్లలేక ఇటీవల ఎన్డీయే వెనక్కి తగ్గాల్సిన పరిస్థితులు పునరావృతం కావు. అందుకే పాత సంగతులను మరిచిపోయి డీఎంకేను ఎన్డీయేలో కలుపుకోవడానికి మోడీ, అమిత్ షా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఐతే డీఎంకే.. ఎన్డీయేలోకి వస్తే ఏపీకి నష్టం కలుగుతుందనే చర్చ నడుస్తోంది. 2024 ఎన్నికల్లో బొటాబొటీ మెజారిటీ సాధించిన నేపథ్యంలో కూటమిలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కీలకంగా మారాయి. తెలుగుదేశం పార్టీకి లోక్‌సభలో 16 మంది, రాజ్యసభలో ఇద్దరు ఎంపీలున్నారు. జనసేకు ఉన్నవి రెండు ఎంపీ సీట్లే అయినా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో దాని ప్రాధాన్యం దానికి దక్కుతోంది.

ఐతే ఇప్పుడు డీఎంకే వచ్చిందంటే ఎన్డీయే బలం పెరుగుతుంది. తెలుగుదేశం, జనసేన పార్టీలు మద్దతు ఉపసంహరించుకున్నా ఇబ్బంది లేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటిదాకా ఏపీకి ఆర్థికంగా చక్కటి సహకారం అందిస్తూ, కోరినన్ని నిధులు, మంచి మంచి ప్రాజెక్టులు కేటాయిస్తూ వస్తున్న మోడీ సర్కారు.. డీఎంకే వచ్చాక కూడా అలాంటి సహకారాన్నే ఇస్తుందా అన్నది ప్రశ్న.

ఐతే ఇప్పుడు డీఎంకే ఏ అవసరంతో ఎన్డీయేలోకి వస్తోందన్నది ఆలోచించి.. ఎన్నికల ముందే జట్టు కట్టిన టీడీపీ, జనసేన పార్టీలను గౌరవించడం, ఏపీకి ఇక ముందే ఇదే సహకారాన్ని కొనసాగించడం అన్నది మోడీ, అమిత్‌ షాల విచక్షణ, నైతికత, విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. మరి డీఎంకే.. ఎన్డీయేలోకి వస్తే మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.