వైసీపీ క‌న్నా ఎక్కువే ఇస్తున్నాం: పవ‌న్‌

వైసీపీ ప్ర‌భుత్వం ఇచ్చిన దానికంటే కూడా.. సంక్షేమ ప‌థ‌కాల‌ను మ‌రింత పెంచి ఇస్తున్నామ‌ని ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. తాజాగా మ‌త్స్య‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో భాగంగా వేట నిషేధ స‌మ‌యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క కుటుంబానికీ రూ.20 వేల చొప్పున ఇచ్చామ‌ని తెలిపారు. ఇది వైసీపీ హ‌యాంలో 10 వేల రూపాయ‌లుగా మాత్ర‌మే ఉంద‌న్నారు. తాము సంక్షేమానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో.. ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని వ్యాఖ్యానించారు.

ప్ర‌స్తుతం రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. అయిన‌ప్ప‌టికీ.. ఇచ్చిన మాట ప్ర‌కారం.. హామీల‌ను నెర‌వేరుస్తున్నామ‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ల‌క్ష 30 వేల‌మంది మ‌త్స్య‌కారులకు మేలు చేస్తున్నామ‌ని చెప్పారు. ఈ నిధుల‌ను స‌క్ర‌మంగా వినియోగించుకోవాల‌ని.. ఆర్థిక ఇబ్బందుల నుంచి బ‌య‌ట ప‌డాల‌ని కోరుకుంటున్న‌ట్టు తెలిపారు.

త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పిఠాపురంలోనూ రైతుల‌కు ఈ ప‌థ‌కాన్ని అందించామ‌ని గుర్తు చేశారు. 6800 మందికిపైగా మ‌త్స్య‌కారుల‌కు పిఠాపురంలో మేలు జ‌రిగింద‌న్నారు. వారంద‌రికీ మ‌రిన్ని సంక్షేమ ప‌థ‌కాల‌ను అందించే ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న‌ట్టు తెలిపారు. 23 ల్యాండింగ్ సెంట‌ర్లు, 31 గ్రామాలు.. అభివృద్ధి ప‌థంలో ముందున్నాయ‌ని చెప్పారు. కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ప్ర‌తి హామీని నెర‌వేరుస్తోంద‌ని వెల్ల‌డించారు.

గ‌త టీడీపీ హ‌యాంలో..

వాస్త‌వానికి మ‌త్స్య‌కారుల‌కు వేట నిషేధ స‌మ‌యంలో భృతి ఇవ్వాల‌న్న ప్ర‌తిపాద‌న టీడీపీ హ‌యాంలోనే మొగ్గ తొడిగింది. అప్ప‌ట్లోనే ఎంత మంది మ‌త్స్య‌కారులు ఉన్నార‌న్న లెక్క‌లు కూడా తీశారు. అయితే.. ఆ త‌ర్వాత ప్ర‌త్యేక హోదా వ్య‌వ‌హారంతోపాటు.. కాపుల ఉద్య‌మాలు తెర‌మీదికి రావ‌డంతో ఈ వ్య‌వ‌హారం తెర‌మ‌రుగైంది. దీంతో వైసీపీ వ‌చ్చిన త‌ర్వాత‌.. మ‌త్స్య‌కార కుటుంబాల‌కు రూ.10 ఇచ్చే భ‌రోసా కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేశారు.