వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను అదేవిధంగా నకిలీ మద్యం కేసులోను ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొన్నాళ్లు జైలుకు కూడా వెళ్లొచ్చారు. అదే సమయంలో ఆయన పై చంద్రబాబు నివాసం పై జరిగిన దాడి కేసు కూడా వెంటాడుతోంది. మరోవైపు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ జోగి మధ్య కూడా అనేక వివాదాలు ఉన్నాయి. పలు కేసులు కూడా నమోదయి కొనసాగుతున్నాయి.
అయినప్పటికీ జోగి రమేష్ ఎక్కడ వెనక్కి తగ్గకపోగా తన ధోరణిని ఆయన కొనసాగిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా మామిళ్ళపల్లిలో రైతులను పరామర్శించేందుకు వెళ్లిన ఆయన మరోసారి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రైతులను ఎలా అడ్డుకుంటారని, రైతులకు గోదాములను ఎలా మూసివేస్తారని ప్రశ్నించడంతోపాటు పోలీసులపై రివర్స్ ధోరణి ప్రదర్శించారు. దీంతో జోగి రమేష్ పై మరో కేసు నమోదు అయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
వాస్తవానికి జోగి రమేష్ గత ఎన్నికల సమయంలో పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం మైలవరం నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించాలని చూస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిణామాలను చూస్తే ఆయనకి ఎక్కడా పాజిటివ్ రేటింగ్ అయితే రావడం లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితి కూడా ఆయన అనుకూలంగా ఉన్నట్టు కనిపించడం లేదు. వాస్తవానికి ఎక్కడో గుంటూరు జిల్లాలో జరిగిన పరిణామాలతో ఆయన స్పందించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ తనను తాను అతిగా ఊహించుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది.
లేకపోతే పార్టీ తరఫున రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదగాలని భావిస్తున్నాడో తెలియదు. కానీ, ప్రస్తుతం జోగి రమేష్ వ్యవహారం వైసీపీలో ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. ఆయన దూకుడు తగ్గించుకుంటారా లేకపోతే అట్లాగే కొనసాగుతారా అనేది పార్టీలోనూ చర్చగా మారింది. ఏది ఏమైనప్పటికీ జోగి రమేష్ పై ఇప్పటికే పలు కేసులు నమోదయి ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి మరిన్ని కేసులు నమోదైతే తనకు సింఫతీ పెరుగుతుందని భావిస్తున్నారేమో అనే చర్చ కూడా నడుస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates