బాబుతో బాలినేని… వైసీపీ బాగా డిస్టర్బ్ అయినట్టే

ఏపీ రాజధాని అమరావతిలోని సచివాలయంలో సోమవారం ఓ కీలక భేటీ జరిగింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడితో జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాబుతో చాలా అంశాలపై చర్చ జరిపానని… అందులో ప్రధానంగా రాజకీయ అంశాలే ఉన్నాయని బాలినేని స్వయంగా పేర్కొన్నారు. ఈ మేరకు బాబుతో తన భేటీకి సంబంధించిన ఫొటోలతో పాటు అక్కడ జరిగిన అంశాలను వెల్లడిస్తూ బాలినేని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ పోస్టులు ఆయన విడిచి వచ్చిన పార్టీ వైసీపీని… ప్రత్యేకించి వైసీపీ, జగన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ను బాగానే ఇబ్బంది పెట్టాయని చెప్పక తప్పదు.

దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉండగా… ఆయన కేబినెట్ లో మంత్రి పదవిని అలంకరించిన బాలినేని… ఆ తర్వాత జగన్ కేబినెట్ లోనూ మంత్రిగా కొనసాగారు. అయితే ఏమయ్యిందో ఏమో తెలియదు గానీ… వైసీపీ అధికారం కోల్పోగానే…బాలినేని వైసీపీని వీడారు. వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో బంధుత్వం కూడా కలిగిన బాలినేని… వైసీపీ వీడిపోవడం నాడు పెద్ద చర్చకే తెర లేపింది. ఎవరేమనుకున్నా పట్టించుకోని బాలినేని వైసీపీ వీడి నేరుగా తన అభిమాన నటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో చేరిపోయారు. ప్రస్తుతం జనసేనలోనే కొనసాగుతున్న బాలినేని.. తాజాగా సోమవారం చంద్రబాబును కలిశారు.

బాలినేని సోషల్ మీడియా ఖాతాల్లో బాబుతో బాలినేని కలిసి ఉన్న ఫొటోలను చూసిన వైసీపీ అభిమానులు ఓ రేంజిలో హర్ట్ అయ్యారని వారి పోస్టులే చెబుతున్నాయి. ఇలాంటి పోస్టుల్లో ఓ పోస్టు చెబుతున్నదేమంటే… వైసీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేసిన వార్డు సభ్యుడి స్థాయి నేతను జగన్ కలిసినా తాము వైసీపీని వీడిపోతామని ఓ జగన్ హార్డ్ కోర్ అనుచరుడు చెప్పారు.

అంటే… జగన్ తో తనకున్న బంధుత్వాన్ని ఆసరా చేసుకుని బాలినేని తిరిగి వైసీపీకి వచ్చినా…ఆయనను పార్టీలోకి తీసుకోరాదన్నది సదరు అనుచరుడు జగన్ నే నేరుగా హెచ్చరిస్తున్నారన్న మాట. మొత్తంగా బాబును కలిసిన బాలినేని.. తన పట్ల వైసీపీ మరోమారు దృష్టి సారించేలా చేసుకోవడంలో మాత్రం సఫలం అయ్యారని చెప్పాలి. అదే సమయంలో ఈ భేటీతో వైసీపీని ఆయన ఓ రేంజిలో దెబ్బ కొట్టారని కూడా చెప్పక తప్పదు.