రేవంత్ రెడ్డిని చేతులు కలపమంటున్న మోడీ

భారత ప్రధాని మోదీ నేడు హైదరాబాద్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హెచ్ ఐసీసీ లో పలు అభివృద్ధి పనులకు మోదీ శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదీ, సీఎం రేవంత్ రెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ వేదికపై రాజకీయాలు మాట్లాడొద్దని రేవంత్ రెడ్డి సూచించారు.

ఈ క్రమంలోనే తన ప్రసంగం సమయంలో ఆ విషయంపై మోదీ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ చెప్పినట్లు ఈ సభలో రాజకీయాలు మాట్లాడబోనని మోదీ అన్నారు. అయితే, తమతో కలవాలని రేవంత్ ను మోదీ ఆహ్వానించడం సంచలనం రేపుతోంది. తమతో కలిస్తే రేవంత్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని అన్నారు.

అయితే, తెలంగాణ డెవలప్మెంట్ కోసం తమతో కలిసి పనిచేయాలని అన్నారు. గత పదేళ్లలో గుజరాత్ కు ఎంత ఇచ్చామో అంత తెలంగాణకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కానీ, అలా చేస్తే ఇప్పుడు తెలంగాణకు ఇస్తున్న నిధులలో సగం తగ్గుతాయని చెప్పారు. అంతకంటే, మంచి సలహా ఒకటి ఇస్తానని, తనతో రేవంత్ కలవాలని మోదీ చమత్కరిస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పరోక్షంగా రేవంత్ రెడ్డిని బీజేపీలో చేరాలని మోదీ ఆహ్వానిస్తున్నారని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. బీజేపీకి బీ టీమ్ గా టీ కాంగ్రెస్ పనిచేస్తోందని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు మోదీ కామెంట్లు ఊతమిచ్చేలా ఉన్నాయని సెటైర్లు వేస్తున్నారు. రేవంత్ కూడా మోదీతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు కనిపిస్తోందని నెటిజన్లు చురకలంటిస్తున్నారు. అయితే, రేవంత్ కు వేసిన గాలానికి మోదీ చిక్కుతారా లేదా అన్నది వేచి చూడాలంటూ జోకులు వేస్తున్నారు.