కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు ఉంటుంది. ప‌ద‌విని వ‌దులుకోవ‌డం తేలిక‌.. కానీ, దానిని తిరిగి సంపాయించుకోవ‌డం మాత్రం చాలా క‌ష్టం. ఈ క్ర‌మంలో కోల్పోయేవి చాలానే ఉంటాయి. ఈ విష‌యంలో క‌మ్యూనిస్టులు ముందుంటున్నారు. గ‌తంలో జ్యోతి బ‌సుకు(ప‌శ్చిమ బెంగాల్ సీఎం) ప్ర‌ధాని ప‌ద‌విని చేప‌ట్టే అవ‌కాశం వ‌చ్చింది. 2004కు ముందు.. జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ్యోతిబ‌సుకు అవ‌కాశం ఇవ్వాల‌ని పార్టీలు తీర్మానం చేశాయి.

కానీ, నాడు క‌మ్యూనిస్టులు.. ప్ర‌ధాని ప‌ద‌విని తీసుకునేందుకు విముఖ‌త వ్య‌క్తం చేశారు. దీంతో మ‌న్మోహ‌న్ సింగ్‌ను ఎంచుకు న్నారు. ఇలా వ‌చ్చిన ఛాన్స్ వ‌దులుకోవ‌డం ద్వారా క‌మ్యూనిస్టులు.. ఇప్ప‌టికీ బాధ‌ప‌డుతూనే ఉన్నారు. నాటి నిర్ణ‌యాన్ని చారిత్ర‌క త‌ప్పిదంగా కూడా అంగీక‌రించారు. ఒక‌వేళ ఆనాడే ప్ర‌ధాని ప‌ద‌విని ద‌క్కించుకుని ఉంటే.. రాష్ట్రాల్లో క‌మ్యూనిస్టు పార్టీలు బ‌ల‌పడేందుకు మార్గం సుగ‌మం అయి ఉండేద‌ని నాయ‌కులు త‌ర‌చుగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. కానీ, ఆనాటి ప‌రిస్థితి మ‌ళ్లీ రిపీట్ అయితే కాదు. అంతేనా.. క‌మ్యూనిస్టు కోట‌లు ఒక్కొక్క‌టిగా క‌మ‌లానికి ద‌క్కుతున్నాయి.

ఇలాంటి ప‌రిస్థితిలో క‌మ్యూనిస్టుల‌కు రాష్ట్ర‌స్థాయిలో మ‌రో కీల‌క అవ‌కాశం ద‌క్కింది. అదే త‌మిళ‌నాడు. ఇక్క‌డ తాజాగా ఏర్ప‌డుతున్న టీవీకే అధినేత విజ‌య్ సార‌థ్యంలోని ప్ర‌భుత్వానికి సీపీఎం, సీపీఐలు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. ఈ రెండు పార్టీల‌కు నాలుగు స్థానాలు ద‌క్కాయి. దీంతో టీవీకే పార్టీ స‌ర్కారు ఏర్పాటుకు తాము స‌హ‌క‌రిస్తామ‌ని క‌మ్యూనిస్టులు తేల్చేశారు. ఈ క్ర‌మంలోనే టీవీకే వారిస్తున్న మ‌ద్ద‌తుకు ప్ర‌త్యామ్నాయంగా.. రెండు మంత్రి ప‌ద‌వుల‌ను ఆఫ‌ర్ చేసింది. అంటే.. ఇద్ద‌రేసి ఉన్న సీపీఐ, సీపీఎంకు ఒక్కొక్క మంత్రి ప‌ద‌వి ద‌క్క‌నుంది. కానీ, ఇక్క‌డే క‌మ్యూనిస్టులు మ‌ళ్లీ మ‌రో చారిత్ర‌క త‌ప్పిదం దిశ‌గా అడుగులు వేశారు.

తాము బ‌య‌ట నుంచి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని.. మంత్రి ప‌ద‌వులు త‌మ‌కు అవ‌స‌రం లేద‌ని కామ్రెడ్స్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. దీంతో వీరికి ఇవ్వాల్సిన మంత్రి సీట్ల‌లో మ‌రొక‌టి కాంగ్రెస్ త‌న ఖాతాలో వేసుకుంది. వాస్త‌వానికి ఇప్పుడున్న పరిస్థితిలో క‌మ్యూనిస్టు పార్టీలు మ‌రింత పుంజుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కేర‌ళ‌లో క‌మ్యూనిస్టు ప్ర‌భుత్వం ఉన్నా.. ఇప్పుడు అది ప‌డిపోయింది.

బెంగాల్‌లో 40 ఏళ్లు సాగిన పాల‌న‌.. ఎప్పుడు మ‌ళ్లీ వ‌స్తుందో చెప్ప‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. త్రిపుర లోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి ఉంది. ఇలాంటి స‌మ‌యంలో త‌మిళ‌నాడులో దాదాపు 50 ఏళ్ల త‌ర్వాత వ‌చ్చిన మంత్రి వ‌ర్గ అవ‌కాశాన్ని క‌మ్యూనిస్టులు కాద‌న‌డం.. ద్వారా మ‌రో చారిత్ర‌క త‌ప్పిదం చేశార‌న్న వాద‌న వినిపిస్తోంది.