ఎవ‌రీ అర్లేక‌ర్‌… ఎందుకింత ర‌చ్చ‌!

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌కు, ర‌చ్చ‌కు దారి తీసిన పేరు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేక‌ర్‌. ఈయ‌న త‌మిళ‌నాడుకు ఇంచార్జ్ గ‌వ‌ర్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కేర‌ళ‌కు మాత్రం పూర్తిస్థాయి గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌. ఎన్‌. ర‌వి త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. అయితే.. ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు, చూపించిన దూకుడు వంటివి స్టాలిన్ ప్ర‌భుత్వానికే కాదు.. దేశానికి కూడా తీవ్ర త‌ల‌నొప్పిగా మారిన విష‌యం తెలిసిందే.

అయితే.. ఎన్నిక‌ల‌కు ముందు అనూహ్యంగా ర‌విని త‌ప్పించిన కేంద్ర ప్ర‌భుత్వం కేర‌ళ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న అర్లేక‌ర్‌కు త‌మిళ‌నాడు బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది. కానీ, ఈయ‌న కూడా ర‌వికి ఏమాత్ర‌మూ తీసిపోని రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకుంటున్నారు. ర‌వి.. ఐపీఎస్ నేప‌థ్యం రావ‌డంతో లోప‌ల బ‌య‌ట కూడా దూకుడు చూపించారు. కానీ అర్లేక‌ర్‌.. మాత్రం చాలా సైలెంట్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ.. పైవారి క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేస్తున్నార‌న్న చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌వుతున్నారు.

ఆర్ ఎస్ ఎస్ నుంచి..

రాజేంద్ర విశ్వ‌నాథ్ అర్లేక‌ర్‌.. గోవాలో జ‌న్మించారు. త‌ర్వాత కాలంలో ఆయ‌న విద్యార్ధి ద‌శ నుంచే జ‌న్ సంఘ్‌.. త‌ర్వాత ఆర్ ఎస్ ఎస్ బాట ప‌ట్టారు. అలా.. మొద‌లైన ఆయ‌న ప్ర‌స్తానం.. బీజేపీలోకి చేరింది. 1989లో బీజేపీలో చేరాక‌.. గోవా రాష్ట్ర బిజెపి అధ్య‌క్ష బాధ్య‌త‌లు కూడా చేప‌ట్టారు. గోవా పారిశ్రామిక అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్‌గా, గోవా రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, వెనకబడ్డ తరగతుల ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత కాలంలో మంత్రిగా కూడా అవ‌కాశం ద‌క్కించుకున్నారు. ఆర్ ఎస్ ఎస్‌కు అత్యంత విధేయుడిగా పేరుతెచ్చుకున్నారు.

మోడీకి మిత్రుడు..

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి క‌నిపించ‌ని మిత్రుల జాబితాలో అర్లేక‌ర్ ఒక‌రు. ఈ మిత్ర‌త్వ‌మే ఆయ‌న‌కు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వులు వ‌రించేలా చేసింది. 2023-25 వ‌ర‌కు బీహార్ గ‌వ‌ర్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. అప్ప‌ట్లోనూ రాజ‌కీయ వాస‌న‌లు వ‌చ్చేలా వ్య‌వ‌హ‌రించార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇక‌, ఆ త‌ర్వాత‌.. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా కొద్దికాలం ప‌నిచేశారు. నిరుడు కేర‌ళ గ‌వ‌ర్న‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఇటీవ‌ల ఎన్నిక‌ల‌కు ముందు త‌మిళ‌నాడు ఇంచార్జ్ గ‌వ‌ర్న‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

ఇలా.. అనేక ప‌ద‌వులు వ‌రించిన‌ప్ప‌టికీ.. ఆర్ ఎస్ ఎస్ వాద‌న‌ను ఆయ‌న వ‌ద‌ల‌క‌పోవ‌డం.. ప్ర‌స్తుత ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది. పోనీ.. విజ‌య్‌ను అడ్డుకుంటే.. వ‌చ్చే మేలేమీ క‌నిపించ‌డం లేదు. అందుకే.. ఇప్పుడు అర్లేక‌ర్ చుట్టూ వివాదం ముసురుకుంది. గ‌వ‌ర్న‌ర్ తీరుకు వ్య‌తిరేకంగా.. ప్ర‌జాసంఘాలు.. టీవీకే నేత‌లు చెన్నైలో శుక్ర‌వారం నిర‌స‌న‌ల‌కు పిలుపునివ్వ‌డం గ‌మ‌నార్హం.