ఏపీపై పెట్టుబ‌డుల వ‌ర్షం.. చంద్ర‌బాబు హ‌ర్షం!

ఏపీలో పెట్టుబ‌డుల వ‌ర‌ద ప్ర‌వ‌హిస్తూనే ఉంది. తాజాగా మ‌రిన్ని పెట్టుబ‌డులు రాష్ట్రంపై క‌న‌క వ‌ర్షం కురిసిన‌ట్టుకురిశాయి. చిన్న పెద్ద అన్నీ క‌లిపి ఒకే రోజు(బుధ‌వారం) రాష్ట్రంలో పెట్టుబ‌డుల‌కు అంగీక‌రించాయి. దీంతో సీఎం చంద్ర‌బాబు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

తాజాగా బుధ‌వారం జ‌రిగిన 17వ పెట్టుబ‌డుల ప్రోత్సాహ‌క మండ‌లి స‌మావేశంలో ప‌లు సంస్థ‌లు పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చాయి. వీటిలో రిల‌య‌న్స్ నుంచి.. రాయ‌ల్ ఎన్ ఫీల్డ్ సంస్థ‌ల వ‌ర‌కు ఉన్నాయి. వీటి ద్వారా వేలాది మందికి ప్ర‌త్య‌క్ష ఉద్యోగాల‌తోపాటు.. మ‌రింత మందికి ప‌రోక్షంగా ఉపాధి ల‌భించ‌నుంది.

జిల్లాల వారీగా తాజా పెట్టుబ‌డులు ఇవీ..

  • స‌త్య‌సాయి జిల్లా: సోలార్ ప‌వ‌ర్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు రిల‌య‌న్స్ సంస్థ‌ముందుకు వ‌చ్చింది. 51300 కోట్ల రూపాయ‌ల‌ను పెట్టుబ‌డిగా పెట్ట‌నుంది. దీనివ‌ల్ల ప్ర‌త్య‌క్షంగా 21 వేల మందికి ఉద్యోగాలు ల‌భిస్తాయి.
  • నంద్యాల‌: హైబ్రీడ్ త్రీ లిమిటెడ్ కంపెనీ.. నంద్యాల జిల్లాలో క్లీన్ ఎన‌ర్జీ రంగంలో 150 కోట్ల రూపాయ‌ల‌ను పెట్టుబ‌డిగా పెట్ట‌నుంది. దీనివ‌ల్ల సుమారు 50 మందికి ఉద్యోగాలు క‌ల్పించ‌నుంది.
  • అనంత‌పురం: ఈ జిల్లాలో 800 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డుల‌తో హైబ్రీడ్ ట్వెల్వ్ లిమిటెడ్ కంపెనీ క్లీన్ ఎన‌ర్జీ సంస్థ‌ను ఏర్పాటు చేయ‌నుంది. 120-150 మందికి ఉద్యోగాలు క‌ల్పించ‌నుంది.
  • క‌డ‌ప: ఈ జిల్లాలో అదానీ కంపెనీ ప‌వ‌న విద్యుత్ రంగంలో 13000 కోట్ల రూపాయ‌ల‌ను పెట్టుబ‌డిగా పెట్ట‌నుంది. దాదాపు 3000 నుంచి 3500 మందికి ఉద్యోగాలు క‌ల్పించ‌నుంది.
  • తిరుప‌తి: యమాన్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ‌.. 9400 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డితో హ‌రిత హైడ్రోజన్ ప్లాంటును ఏర్పాటుచేయ‌నుంది. సుమారు 5 వేల మందికిపైగా ఉద్యోగాలు, ఉపాధి ల‌భిస్తాయి.
  • విజ‌య‌న‌గ‌రం: అమృత శ్రీ బయో సీఎన్జీ లిమిటెడ్ సుమారు 90 కోట్ల రూపాయ‌ల పెట్టుబడులతో సీఎన్జీ ఉత్ప‌త్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌నుంది. త‌ద్వారా స్థానికంగా 400 మందికి ఉద్యోగాలు క‌ల్పించ‌నుంది.
  • అలానే, నెల్లూరు, ఏలూరు, తూర్పుగోదావ‌రి, ఎన్టీఆర్ జిల్లాల్లోనూ పెట్టుబ‌డులు పెట్టేందుకు .. చాలా కంపెనీలు ముందుకు వ‌చ్చాయి. వాటి ఏర్పాటు ద్వారా.. సుమారు 1000 మందికి ఉద్యోగాలు క‌ల్పించ‌నున్నారు.

విశాఖ‌కు అతి పెద్ద పెట్టుబ‌డి..

ఐటీ కేంద్రంగా డేటా హ‌బ్‌గా రూపాంత‌రం చెందుతున్న విశాఖ‌లో ఇప్పుడు మ‌రో భారీ పెట్టుబ‌డి వ‌చ్చింది. రిలయన్స్ సంస్థ ల‌క్ష 8వేల కోట్ల రూపాయ‌ల‌తో మ‌రో డేటా సెంటర్ ఏర్పాటు చేయ‌నుంది. ఇక‌, తిరుపతిలో ప్ర‌తిష్టాత్మ‌క ద్విచ‌క్ర వాహ‌న త‌యారీ సంస్థ‌.. రాయల్ ఎన్‌ఫీల్డ్ 2500 కోట్ల రూపాయ‌ల‌ను పెట్టుబ‌డిగా పెట్ట‌నుంది.