ఈసారి బీజేపీ బౌండరీ కొట్టింది

దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత విజయం దక్కించుకుంది. వీటిలో ఒక్క రాష్ట్రంలో మాత్రమే కూటమి కట్టి ఎన్నికలకు వెళ్లగా, మిగిలిన రెండు రాష్ట్రాల్లోనూ ఒంటరిగానే గెలుపు గుర్రం ఎక్కింది. అదే సమయంలో తమిళనాడులో కూడా ఎన్నికల అనంతరం పొత్తు కుదిరితే, బీజేపీ నేతృత్వంలోని అన్నాడీఎంకే + టీవీకేలు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. తద్వారా కమల వికాసం నాలుగు రాష్ట్రాల్లో జరిగినట్టు అవుతుంది. మొత్తంగా బీజేపీ గత పార్లమెంట్ ఎన్నికలతో పోల్చితే తాజాగా దూకుడు పెరిగిందనే అంచనాలు వస్తున్నాయి.

తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు తాజాగా ఎన్నికలు జరిగాయి. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నార్ కాంగ్రెస్ + బీజేపీలు కలిసి ముందుకు సాగాయి. ఇక్కడ ఈ కూటమి విజయం దక్కించుకుంది. వరుసగా గెలుపు గుర్రం ఎక్కినట్టు అయింది. ఇక అసోంలో బీజేపీ అప్రతిహత విజయం దక్కించుకుంది. 140 స్థానాల్లో 100 స్థానాలకు పైగా బీజేపీ ఒంటరిగానే తెచ్చుకుంది. ఇది ఆ పార్టీ దక్కించుకున్న రెండో రాష్ట్రం.

ఇక అందరి కళ్లూ విప్పార్చుకుని చూస్తున్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఇక్కడ 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే, కడపటి సమాచారం ప్రకారం 176 స్థానాల్లో బీజేపీ విజయం దక్కించుకుంది. మెజారిటీ కంటే ఎక్కువగా సీట్లు దక్కించుకోవడం విశేషం. అంతేకాదు, పూర్వోదయ భారతంలోని అతి పెద్ద రాష్ట్రంగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ తొలిసారి విజయం దక్కించుకున్నట్టే అవుతుంది. ఫలితంగా ఇది బీజేపీకి దక్కిన మూడో రాష్ట్రం అవుతుంది.

అయితే తమిళనాడులో ఏ పార్టీకీ మెజారిటీ ఫిగర్ దక్కలేదు. అతి పెద్ద పార్టీగా (సింగిల్ లార్జెస్ట్) నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే నిలిచింది. ఈ పార్టీకి 110 స్థానాల్లో ఆధిక్యత లభించింది. ఈ పార్టీ తప్పనిసరిగా బీజేపీ నేతృత్వంలోని అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇది జరుగుతుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఇక్కడ కూడా పొత్తు రాజకీయాలు కుదిరితే, బీజేపీ తమిళనాట కూడా తొలిసారి అధికారంలోకి వచ్చినట్టే అవుతుంది. కేరళలో మాత్రం బీజేపీ చేతులు ఎత్తేసింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఏర్పడింది.