“అస‌లు సిస‌లు ప్ర‌జా ద్రోహి కేజ్రీవాలే“

ఆమ్ ఆద్మీ పార్టీ క‌న్వీన‌ర్‌, ఢిల్లీ మాజీముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజ‌యం ద‌క్కించుకుని.. ప్ర‌స్తుతం బీజేపీ గూటిక చేరిన ప‌లువురు చ‌ట్ట‌స‌భ స‌భ్యులు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. “పార్టీ నుంచి వెళ్లిపోయిన వారు ద్రోహులు“ అంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆప్ రాజ్య‌స‌భ‌ ఎంపీ(బీజేపీలో చేరారు) స్వాతి మాలివాల్ తీవ్ర‌వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు సిస‌లు ప్ర‌జాద్రోహి.. కేజ్రీవాలేన‌ని ఆమె దుయ్య‌బ‌ట్టారు. అంతేకాదు.. 100 కోట్ల రూపాయ‌ల‌తో గుడ్‌గావ్‌లో ఇల్లు ఎలా వ‌చ్చిందో చెప్పాల‌ని నిల‌దీశారు. ఈ క్ర‌మంలో కేజ్రీవాల్ గ‌తాన్ని ఆమె త‌వ్వితీశారు.

లోక్‌పాల్ ఉద్య‌మం స‌మ‌యంలో కేజ్రీవాల్ ఓ డొక్కు కారులో తిరిగార‌ని.. ఆయ‌న చొక్కాకు రెండు మూడు చిరుగులు వుండేవ‌ని పేర్కొన్న స్వాతి.. కేజ్రీవాల్ అప్ప‌ట్లో 2 రూపాయ‌ల పెన్నును వాడార‌ని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు ఖ‌రీదైన దుస్తులు.. అంతే ఖ‌రీదైన పెన్నుతో ల‌గ్జ‌రీ కారులో ఎలా తిరుగుతున్నారో చెప్పాల‌ని ప్ర‌శ్నించారు.

ఢిల్లీ ప్ర‌జ‌ల‌ను మోసం చేసి..వారి సొమ్మును దోచుకున్నార‌ని ఆరోపించారు. అస‌లు సిస‌లు ప్ర‌జా ద్రోహి కేజ్రీవాలేన‌ని నిప్పులు చెరిగారు. తాము ఎవ‌రో బ‌ల‌వంతం చేస్తేనో.. లేక‌.. ఎవ‌రో బెదిరిస్తేనో.. పార్టీ మార‌లేద‌ని.. ప్ర‌ధాని మోడీ పాల‌న న‌చ్చి.. సంస్క‌ర‌ణ‌ల ప‌థం మెచ్చి..ఆయ‌న వెంట దేశానికి సేవ చేయాల‌న్న ఏకైక సంక‌ల్పంతోనే ముందుకు సాగుతున్నామ‌ని ఆమె వ్యాఖ్యానించారు.

ఎవ‌రీ స్వాతి?

స్వాతి మాలివాల్‌కు దాదాపు 20 ఏళ్లుగా కేజ్రీవాల్ తో ప‌రిచ‌యం ఉంది. ఆయ‌న సార‌థ్యంలోనే ఆమె రాజ‌కీయ నాయ‌కురాలిగా ఎదిగారు. ప్ర‌స్తుతం 41 ఏళ్ల వ‌య‌సున్న స్వాతి.. హెచ్‌సీఎల్‌లో ప‌నిచేస్తున్న స‌మ‌యంలో కేజ్రీవాల్‌, అన్నాహ‌జారే నాయ‌క‌త్వంలో అవినీతికి వ్య‌తిరేకంగా ఉద్య‌మం సాగిన‌ప్పుడు.. కేజ్రీవాల్ ఆశ‌య సాధ‌న కోసం.. అంటూ.. ఉద్యోగాన్ని వీడి ఆయ‌న వెంట న‌డిచారు.

ఆ త‌ర్వాత క్ర‌మంలో ఢిల్లీలో ఆప్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ఆమెకు మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ ప‌ద‌విని ఇచ్చారు. అనంత‌రం.. రాజ్య‌స‌భ‌కు పంపించారు. ఇలా.. ఒక్కొక్క మెట్టు ఎదిగిన స్వాతి కూడా.. 50 కోట్ల రూపాయ‌ల‌తో బంగ‌ళా క‌ట్టుకున్నార‌ని.. గ‌త ఢిల్లీఎన్నిక‌ల‌కు ముందు.. బీజేపీ నాయ‌కులు ఆరోపించారు.

అంతేకాదు.. కేజ్రీవాల్ స‌హా.. స్వాతి(అప్ప‌ట్లో ఆప్ అధికార ప్ర‌తినిధిగా ఉండి.. బీజేపీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసేవారు) అక్ర‌మాలు, అవినీతిని కూడా తోడుతామ‌ని బీజేపీ ప్ర‌చారంలో జోరుగా చెప్పింది. అలాంటి నాయ‌కురాలు..ఇప్పుడు బీజేపీ పంచ‌న చేరిపోయారు. త‌ప్పు ఒప్పులు ప‌క్క‌న పెడితే.. `నైతిక‌త` అనేది ముఖ్యం. కానీ.. ఇప్పుడు అది కూడా లేకుండా పోవ‌డం.. త‌న‌కు దారి చూపించిన వారిపైనే బుర‌ద జ‌ల్ల‌డం రాజ‌కీయాల‌లో కామ‌న్ అయిపోయింది.