తెలంగాణ నూతన డీజీపీగా సీవీ?

ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లోనే విధులు నిర్వర్తించిన సీనియర్ పోలీసు అధికారి సీవీ ఆనంద్ తెలంగాణకు తదుపరి డీజీపీగా పదవీ బాధ్యతలు చేపట్టనునట్టు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆనంద్ పనిచేస్తున్నారు. అంతకుముందు హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా రెండు పర్యాయాలు అవకాశం దక్కించుకున్న ఆనంద్… పోలీసింగ్ లో తనదైన మార్కును చూపారు. 

ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న శివధర్ రెడ్డి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో నూతన డీజీపీగా ఎవరిని నియమించాలన్న విషయంపై రేవంత్ రెడ్డి సర్కారు… పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడిన జాబితాను యూపీఎస్సీకి పంపింది. ఈ జాబితాను పరిశీలించిన యూపీఎస్సీ…ముగ్గురు అధికారులతో కూడిన జాబితాను పంపింది. అందులో సీవీ ఆనంద్ పేరు ఉంది. దీంతో సీవీ ఆనంద్ నే డీజీపీగా నియమిస్తారన్న టాక్ వినిపిస్తోంది. 

ఈ వార్తలు నిజమేనన్నట్టుగా ప్రస్తుతం సీవీ ఆనంద్ కొనసాగుతున్న హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్టును మరో సీనియర్ ఐపీఎస్ అధికారిణి అయిన శిఖా గోయల్ కు అప్పగించారు. శుక్రవారం పలువురు సీనియర్ ఐపీఎస్ అధికెారులను బదిలీ చేసిన తెలంగాణ సర్కారు… శిఖా గోయల్ ను హోం శాఖకు బదిలీ చేశారు.

శిఖా గోయల్ ను హోం శాఖకు బదిలీ చేయడం, ఆ వెంటనే యూపీఎస్సీ నుంచి సీవీ ఆనంద్ తో కూడిన జాబితా రాష్ట్ర ప్రభుత్వానికి అందడంతో సీవీ ఆనందే తదుపరి డీజీపీ అన్న వాదనలకు బలం చేకూరింది. మే తొలి వారంలో తెలంగాణ డీజీపీగా ఆనంద్ పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.