తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని రేకెత్తించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏప్రిల్ 23న డిపో ఎదుటే తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న శంకర్ గౌడ్, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో కన్నుమూశారు. 32 డిమాండ్ల సాధన కోసం జరుగుతున్న సమ్మె నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో చర్చలు జరుపుతామని పేర్కొన్నారు. ప్రభుత్వం త్వరలోనే ఆర్టీసీ జేఏసీతో చర్చలు ప్రారంభించి సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు కట్టుబడి ఉందని తెలిపారు.
ఇక ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, కార్మికులు అధైర్యపడవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే నిరసనలు కొనసాగించాలని, ఆవేశపూరిత చర్యలకు పాల్పడవద్దని సూచించారు.
ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మికులు పలు డిపోల వద్ద నిరసనలు చేపట్టి, శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ప్రభుత్వం చర్చల దిశగా అడుగులు వేస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates