నాయకుడు లేకుండా యుద్ధం ఎలా జగన్?

స్థానిక ఎన్నికల్లో గెలుపోటములను ప్రత్యర్థులు ఎలా మేనేజ్‌ చేసినా.. యుద్ధం మాత్రం జరగాలట..! తన పార్టీ కార్యకర్తలకు జగన్‌ ఇస్తున్న రోడ్‌మ్యాప్‌ ఇదే..! స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తన పార్టీ శ్రేణులకు ఇస్తున్న ఈ ఆదేశాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

అయితే యుద్ధం చేయాల్సింది క్యాడర్‌ అయితే.. నాయకుడు ఎక్కడ? గత ఎన్నికల నుంచి ఇప్పటివరకు జగన్‌ ఒక్కసారి కూడా రోడ్డుపైకి వచ్చి ప్రత్యక్ష పోరాటానికి దిగలేదు. పార్టీ క్యాడర్‌ రోడ్లపై ఉంటే.. అధినేత మాత్రం ఏసీ గదులకే పరిమితమయ్యారంటూ కూటమి నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

ఎన్నికల సమరంలో ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సిన బాధ్యత కేవలం కార్యకర్తలదేనా? నాయకత్వం కూడా వారికి అండగా నిలవాల్సిన అవసరం లేదా? ఎన్నికలు అంటే కేవలం రోడ్‌మ్యాప్‌లు ఇవ్వడం కాదు.. రోడ్డుపైకి వచ్చి క్యాడర్‌ను నడిపించడం కూడా.

అధికారం కోల్పోయిన తర్వాత దాదాపు ఏడాది పాటు వైసీపీ అధినేతతో పాటు శ్రేణులు స్తబ్ధుగా ఉండిపోయారు. ఆ తర్వాత అప్పుడప్పుడు పరామర్శల పేరుతో జగన్‌ రోడ్డుపైకి వచ్చారు. ఆ కార్యక్రమాలన్నీ బలప్రదర్శన మాదిరిగా ఉన్నాయని ఆరోపణలు కూడా వచ్చాయి. ఒక్క డీఎస్సీ అంశంపైనే ఆరోపణలు చేస్తూ కాలం గడిపేస్తున్నారు. ఏడాది తర్వాత చేపట్టబోయే పాదయాత్రపైనే ఆయన ఆశ పెట్టుకున్నారు.

ఈ మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో జగన్‌ అలెర్ట్‌ అయ్యారు.

స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్న జగన్‌.. ఈసారైనా స్వయంగా రంగంలోకి దిగుతారా? కార్యకర్తలతో కలిసి రోడ్డుపైకి వచ్చి రాజకీయ పోరాటానికి నాయకత్వం వహిస్తారా? లేక మరోసారి క్యాడర్‌కే యుద్ధ బాధ్యతలు అప్పగించి తాను దూరంగా ఉంటారా? అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.