ఇంకా షూటింగ్ మొదలుకుండానే కేవలం ప్రీ లుక్ పోస్టర్ తో జూనియర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేసిందో చూశాం. కుమారస్వామి / మురుగన్ మీద మూవీ అని తెలియగానే ఆఘమేఘాల మీద కోలీవుడ్ నుంచి అనౌన్స్ మెంట్లు వచ్చేశాయి. వాటిలో ధనుష్ – వెట్రిమారన్ కాంబో ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంటే మనోళ్లు తీసే దాకా తమిళ దర్శక నిర్మాతలకు ఈ కాన్సెప్ట్ మీద కథలు చెప్పే ఆలోచన రాలేదని అర్థమైపోయింది.
ఆదర్శ కుటుంబం ఏకె 47 రిలీజ్ తర్వాత దీనికి సంబంధించిన పనులను త్రివిక్రమ్ శ్రీనివాస్ వేగవంతం చేయబోతున్నారు. ప్రస్తుతం భుజం గాయం వల్ల రెస్ట్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ నవంబర్ లేదా డిసెంబర్ నుంచి డ్రాగన్ బ్యాలన్స్ షూటింగ్ లో పాల్గొంటాడు. ఆ తర్వాత లుక్ మార్చుకుని, మేకోవర్ చేసుకుని వచ్చేలోపు 2027 సగం అంటే సమ్మర్ అయిపోతుంది. మాటల మాంత్రికుడికి స్క్రిప్ట్ మెరుగులు, ప్రీ ప్రొడక్షన్ పనులకు తగినంత సమయం దొరికినట్టవుతుంది.
తాజాగా మరో అప్డేట్ తారక్ అభిమానులకు హుషారు ఇచ్చేలా ఉంది. దాని ప్రకారం ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ రెండు టైటిల్స్ ఈ ప్రాజెక్టు కోసం రిజిస్టర్ చేసిందట. ఒకటి ‘గాడ్ అఫ్ వార్’ ఎప్పటి నుంచో ప్రచారంలో ఉండగా రెండోది ‘దేవసేనాపతి’గా చెబుతున్నారు. అయితే ప్యాన్ ఇండియా అప్పీల్ రావాలంటే ఇంగ్లీష్ లో ఉంటేనే బాగుంటుందనే అభిప్రాయం కొందరిలో ఉండగా, బాహుబలి లాగా రీజనల్ టైటిల్ పెట్టినా కంటెంట్ లో దమ్ముంటే ఏ దేశం వాళ్ళైనా చూస్తారనేది ఇంకో కామెంట్.
ఏది ఫైనల్ చేస్తారో ఇప్పుడప్పుడే తేలకపోవచ్చు. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి కొన్ని నెలలు పడుతుంది. ఇప్పటిదాకా తెలుగు తప్ప ఇతర భాషల్లో ఇమేజ్, మార్కెట్ సంపాదించుకోలేకపోయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. బడ్జెట్ కూడా భారీగా ఖర్చు పెడుతున్నారు. బయటికి చెప్పడం లేదు కానీ మూడు వందల కోట్ల దాకా కేటాయించబోతున్నట్టు తెలిసింది. క్యాస్టింగ్, అనిరుధ్ కాకుండా ఇతర టెక్నికల్ టీమ్ ని సెట్ చేసుకునే పనిలో త్రివిక్రమ్ బృందం బిజీగా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates