ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ.. ఎవ‌రికి వారు పార్టీలో స్వ‌తంత్ర నాయ‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న‌ది వాస్త‌వం. ఇది .. పార్టీని ముందుకు తీసుకువెళ్ల‌క‌పోగా.. మ‌రింత వెన‌క్కి నెడుతోంద‌ని తెలుస్తోంది. తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన క‌న్న‌బాబును ఉత్త‌రాంధ్ర ఇంచార్జ్‌గా నియ‌మించిన త‌ర్వాత‌.. పార్టీలో స‌హ‌కారం కొర‌వ‌డింది. దీంతో ఆయ‌నను కేవ‌లం విశాఖ‌కు ప‌రిమితం చేశారు.

అయినా కూడా బొత్స స‌త్య‌నారాయ‌ణ సామాజిక వ‌ర్గం పార్టీలో వేర్వేరు గ్రూపులు ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతోంది. జిల్లాల ప‌రంగా చూసుకుంటే.. టీడీపీ, జ‌న‌సేన‌ల‌కు ఉన్న బ‌లం వైసీపీకి క‌నిపించ‌డం లేదు. విశాఖ‌లో ఎంపీ భ‌ర‌త్ స‌హా టీడీపీ సీనియ‌ర్లు.. పార్టీని బ‌లంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. కానీ, ఇదేస‌మ‌యంలో వైసీపీ త‌ర‌ఫున బ‌ల‌మైన వాయిస్ వినిపించే గుడివాడ అమ‌ర్నాథ్ వంటి వారికి పార్టీలో స‌హ‌కారం అంతంత మాత్ర‌మేన‌న్న‌ది సీనియ‌ర్లే చెబుతున్నారు.

ఇక‌, శ్రీకాకుళంలో ధ‌ర్మాన సోద‌రుల‌పైనే వైసీపీ ఆధార‌ప‌డింది. మాజీ మంత్రిసీదిరి అప్ప‌ల‌రాజును వైసీపీ నాయ‌కులు ప‌క్క‌న పెట్టేశారు. మ‌రోవైపు.. ఇదే జిల్లాలో జ‌న‌సేన‌, టీడీపీ త‌ర‌ఫున కింజ‌రాపు ఫ్యామిలీ స‌హా.. ఇత‌ర నాయ‌కులు బ‌లంగా పార్టీ ల‌ను ముందుకు తీసుకువెళ్తున్నారు. వీరి దెబ్బ‌తో వైసీపీ ఎక్క‌డా పుంజుకునే ప‌రిస్థితి కూడా లేద‌ని అంటున్నారు. పోనీ.. పాత నాయ‌కులు అయినా.. బ‌య‌ట‌కు వ‌స్తున్నారా? అంటే.. కేవ‌లం మీడియా స‌మావేశాల‌కే ప‌రిమితం అవుతున్నారు.

ఇక‌, విజ‌య‌న‌గరంలో వైసీపీ చీలిక‌లు పేలిక‌లుగా త‌యారైంద‌న్న‌ది పార్టీలో కొన్నాళ్లుగా చ‌ర్చ సాగుతోంది. జిల్లాలో బొత్స ప్రాతినిధ్యాన్ని త‌గ్గించ‌డం ద్వారా.. వైసీపీ పెద్ద పొర‌పాటు చేసింద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక‌, ఇదేజిల్లాలో జ‌న‌సేన భారీగా పుంజుకుంటోంది. దీనికి టీడీపీ స‌హ‌కారం కూడా తోడైంది. దీంతో ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాలలోనూ.. వైసీపీ వ‌ర్గ పోరుతో ముందుకు సాగ‌లేక‌.. వెన‌క్కి రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటే.. జ‌న‌సేన‌+టీడీపీ ఉమ్మ‌డిగా జిల్లాల‌ను దున్నేసే ప‌రిస్థితి నెల‌కొంది.