అలా షాక్ ఇచ్చారేంటి మోదీ గారు

ఎన్నిక‌ల రాజ‌కీయాల్లో ఆరితేరిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. సమ‌యం.. సంద‌ర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అత్యంత‌చేరువ అయ్యేలా ఆయ‌న రాజ‌కీయ వ్యూహాలు.. అడుగులు ఉంటాయి. దాదాపు ప‌న్నెండు ఏళ్ల త‌ర్వాత‌.. ఆయ‌న ఇలాంటి రాజ‌కీయ అడుగులు వేశారు. అదికూడా కీల‌క‌మైన ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాల‌ని బీజేపీ ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది.

ఏం చేశారంటే..

ప్ర‌ధాన మంత్రి మోడీ.. ఆది వారి బెంగాల్‌లోని ప‌లు ప్రాంతాల్లో ప్ర‌చారం నిర్వ‌హించారు. బీజేపీ అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని కోరారు. అయితే.. ఆయ‌న త‌న ప్ర‌చారాన్ని ముగించుకుని ఇక‌, ఢిల్లీకి వ‌చ్చేస్తున్న స‌మ‌యంలో కాన్వాయ్‌ను అనూహ్యంగా ఆయ‌న ఝార్‌గ్రామ్ నియోజ‌క‌వ‌ర్గంలోని ఓ రోడ్డు ప‌క్క‌న ఆపేయ‌మ‌న్నారు. ఇంకేముంది.. పీఎం చెప్ప‌డంతో.. అధికారులుల కూడా కాన్యాయ్‌ను ఆపేశారు. ఆ త‌ర్వాత‌.. ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ తెలియ‌దు. ముంద‌స్తు ప్ర‌ణాళిక కూడా లేదు.

ఆ వెంట‌నే కారు దిగిన మోడీ.. రోడ్డు ప‌క్క‌నే ఉన్న ఓ చిరు తిండ్ల దుకాణానికి వెళ్లారు. అంద‌రికీ ఆశ్చ‌ర్యం!. ప్ర‌ధాని అంత‌టి వారు వ‌స్తున్నార‌ని.. ఆ దుకాణ దారుడికి కూడా తెలియ‌దు. అప్ప‌టికే చెమ‌ట‌ప‌ట్టేసిన ముఖంతో ఉన్నాడు. కానీ.. త‌న దుకాణం ముందు.. ప్ర‌ధాని నిల‌బ‌డ్డారు. ముందు పిచ్చాపాటీ ఏదో మాట్లాడారు. అనంత‌రం.. అత‌ని వ‌ద్ద‌.. మ‌ర‌మ‌రాల‌తో చేసే.. చిరుతిండి ఝ‌ల్‌మురి(మ‌న‌దగ్గ‌ర చాట్ అంటాం క‌దా అలాంటిది)ని ప్ర‌త్యేకంగా త‌యారు చేయించుకుని తీసుకున్నారు. ఈలోగా అక్క‌డ‌కు స్థానిక మ‌హిళ‌లు.. కుర్రాళ్లు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

అధికారులు వారిని అడ్డుకోబోగా.. ప్ర‌ధాని వ‌ద్ద‌ని వారించ‌డ‌మే కాదు.. వ‌చ్చిన వారితో ముచ్చ‌టించారు. ఈలోగా.. దుకాణ దారుడు.. త‌యారు చేస్తున్న చిరుతిండిని ఆస‌క్తిగా ప‌రిశీలించారు. దానికి సంబంధించిన నగ‌దును కూడా ప్ర‌ధాన త‌న జేబులోంచి తీసి చెల్లించారు. ముందు దుకాణ‌దారుడు సొమ్ములు వ‌ద్ద‌న్నా.. ప్ర‌ధాని బ‌ల‌వంతంగా ఆయ‌న‌కు ఇవ్వ‌డం క‌నిపించింది. మొత్తంగా.. ఇది సామాన్యుల‌ను ఆక‌ర్షించేలా ఉండడం గ‌మ‌నార్హం.

గ‌తంలో పుష్క‌రం కింద‌ట‌.. 2014లో కూడా ప్ర‌ధాని ఇలానే చేశారు. అప్ప‌టి ఎన్నిక‌ల్లో ప్ర‌చారం మ‌ధ్యంలోనే ఆయన కాన్వాయ్ దిగి.. టీ దుకాణాల ముందు వాలిపోయే వారు. ఏపీలోకి వ‌చ్చిన‌ప్పుడు.. మిర‌ప‌కాయ బ‌జ్జీదుకాణం ముందు నిలిచి.. బ‌జ్జీల‌న‌ను ఆర‌గించ‌డం అప్ప‌ట్లో పెద్ద ఎత్తున ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఇలా.. ప్ర‌ధాని బ్రేకులు ఆస‌క్తిగా మారాయి. మ‌రి తాజా ప‌రిణామం.. బీజేపీకి ఏమేర‌కు మేలు చేస్తుందో చూడాలి.