జ‌గ‌న్‌కు రెస్ట్‌… నాయ‌కుల‌కు టార్గెట్‌!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. త‌న స‌తీమ‌ణి భార‌తితో క‌లిసి.. యూర‌ప్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి సీబీఐ కోర్టు ప‌లు ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తులు ఇచ్చింది. వ‌చ్చే నెల 15వ తేదీ వ‌ర‌కు కూడా.. జ‌గ‌న్ దంప‌తులు త‌మ కుమార్తెల‌తో యూర‌ప్ దేశాల్లో రెస్టు తీసుకోనున్నారు. దీనిని ఎవ‌రూ త‌ప్పుబ‌ట్ట‌రు. కానీ.. ఇదేస‌మ‌యంలో పార్టీకి.. పార్టీ నాయ‌కుల‌కు కొన్ని ల‌క్ష్యాలు నిర్దేశించారు.

తాను విదేశాల‌కు వెళ్తున్న నేప‌థ్యంలో పార్టీ నాయ‌కులు యాక్టివ్‌గా ఉండాల‌ని జ‌గ‌న్ తేల్చి చెప్పారు. పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించేందుకు పార్టీ రాష్ట్ర కోఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వ్య‌వ‌హ‌రించాల‌ని జ‌గ‌న్ తేల్చి చెప్పారు. ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నుల‌ను క‌నిపెట్టి ఉండాల‌ని సీనియ‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేసిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. ప్ర‌స్తుతం రైతుల‌కు విత్త‌నాలు, ఎరువులు ద‌క్క‌ని ప‌రిస్థితి ఉంద‌న్నారు.

ఈ నేప‌థ్యంలో రైతుల ప‌క్షాన పోరాడేందుకు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని జ‌గ‌న్ నాయ‌కుల‌కు సూచించారు. ఈ నెల ఆఖ‌రు నుంచి రైతుల త‌ర‌ఫున కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల‌ని.. ప్ర‌భుత్వాన్ని క‌దిలించాల‌ని ఆయ‌న చెప్పారు. ఇక‌, విద్యార్థుల ఫీజు రీయింబ‌ర్స్‌మెంటుపై కూడా ఇప్ప‌టి నుంచే ఉద్య‌మాలు చేప‌ట్టాల‌ని పిలుపునివ్వ‌డం గ‌మ‌నార్హం. ఈ రెండు విష‌యాల‌పై ఈ నెల ఆఖ‌రులోనే స్పందించాల‌న్నారు. అయితే.. జ‌గ‌న్ విదేశాల‌కు వెళ్తూ.. ఇలా నాయ‌కుల‌కు క‌ర్త‌వ్యం నిర్దేశించ‌డంపై ప‌లువురు పెద‌వి విరుస్తున్నారు.

ఇదే కొత్త‌కాదు..

వాస్త‌వానికి జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలిని గ‌మ‌నిస్తే.. ఇప్పుడు మాత్ర‌మే కాదు.. ఆయ‌న గ‌తంలో కూడా.. పీపీపీ విధానాన్ని వ్య‌తిరేకిస్తూ.. ఉద్య‌మం చేప‌ట్టారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా నాయ‌కుల‌కు సూచ‌న‌లు చేశారు. కానీ, అదే రోజు ఉద‌యం ఆయ‌న బెంగ‌ళూరు ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిపోయారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే నాయ‌కులు మౌనంగా ఉంటున్నారు. మ‌రి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.