దేశంలో సుదీర్ఘకాలంగా ఎలాంటి పెంపునకు గురి కాకుండా ఉండిపోయిన లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన తెర మీదకు రాగా… కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అడ్డుకుంది. ఫలితంగా జనాభా లెక్కలతో సంబంధం లేకుండా జరిగిపోతుందనుకున్న డీలిమిటేషన్ కు అడ్డుకట్ట పడిపోయింది. దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రధాన పార్టీలు ఈ బిల్లును అడ్డుకున్న తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. దక్షిణాదికి వరంలా మారే అవకాశం ఉన్న డీలిమిటేషన్ ను చేజేతులారా ఆ రాష్ట్రాలకు చెందిన పార్టీలే కాలదన్నుకున్నాయని లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ లాంటి విశ్లేషకులు చెబుతున్నారు.
శుక్రవారం నాడు పార్లమెంటులోని దిగువ సభ లోక్ సభలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై ఓటింగ్ జరగగా.. మూడింట రెండొంతుల సభ్యుల మద్దతు లేకపోవడంతో ఈ బిల్లు వీగిపోయింది. ఈ నేపథ్యంలో శనివారం ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేపీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.1971లో నియోజకవర్గాల పునర్విభజన జరగగా..ఆ తర్వాత ఆ దిశగా అడుగే పడలేదని ఆయన తెలిపారు. తాజాగా 2026 జనాభా లెక్కలు అందుబాటులోకి వస్తే… ఆ లెక్కల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, ఇదే జరిగితే… దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
దేశ జనాభాను అదుపు చేసేందుకు కుటుంబ నియంత్రణను నాడు కేంద్రం అమలు చేయగా… దక్షిణాది రాష్ట్రాలు పక్కాగా ఆ పథకాన్ని అమలు చేయడంతో ఆ రాష్ట్రాల్లో జనాభా అదుపులోకి వచ్చింది. అయితే కేంద్రం ఆదేశాలను తుంగలో తొక్కిన ఉత్తరాది రాష్ట్రాలు ఇబ్బడిముబ్బడిగా జనాభాను పెంచే దిశగా సాగాయి. ఈ దరిమిలా జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే… ఇప్పటికే అధిక సంఖ్యలో లోక్ సభ సీట్లను కలిగిన ఉత్తరాది రాష్ట్రాలు మరిన్ని సీట్లను పొందుతాయని జేపీ విశ్లేషించారు. అదే సమయంలో జనాభా నియంత్రణను పాటించిన దక్షిణాది రాష్ట్రాలు ప్రస్తుతం ఉన్న సీట్లను కూడా కోల్పోతాయని ఆయన చెప్పుకొచ్చారు.
2026 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే… ఏపీలో ప్రస్తుతం ఉన్న 25 సీట్లు 20 పడిపోతాయని జేపీ అన్నారు. అదేవిధంగా తెలంగాణలో 17 నుంచి 14కు, తమిళనాడులో 39 నుంచి 29కి, కర్ణాటకలో 289 నుంచి 24కు, కేరళలో 20 నుంచా 13కు సీట్ల సంఖ్య పడిపోతుందని ఆయన చెప్పారు. అదే సమయంలో దక్షిణాదికి అతి దగ్గరగా ఉన్న ఒడిశా, పశ్చిమ బెంగాల్ లోనూ నాలుగేసి సీట్ల చొప్పున తగ్గుతాయని ఆయన వివరించారు.
అయితే జనాభా లెక్కలతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రంలో ఉన్న సీట్లకు అదనంగా 50 శాతం సీట్లను పెంచే దిశగా ఎన్డీఏ సర్కారు బిల్లు తీసుకువచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఏ రాష్ట్రంలో ఎన్నేసీ సీట్లు పెరుగుతాయన్న విషయాన్ని స్వయంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఈయా రాష్ట్రాల్లో సీట్ల పెంపునకు సంబంధించిన అంశాన్ని బిల్లుకు జతచేసి మరీ తీసుకువస్తామని షా చెప్పారని… ఇంత చెప్పినా విపక్షాలు వినకపోవడం సబబు కాదని ఆయన అన్నారు. అందివచ్చిన బంగారం లాంటి అవకాశాన్న విపక్షాలు చేజార్చుకున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates