వాళ్ల‌ను వ‌దిలేయండి… విద్యార్థుల నిర్బంధంపై సుప్రీం ఆదేశం

ఢిల్లీలో చేపట్టిన నీట్ నిర‌స‌న‌ల‌కు సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసింది. ఇప్ప‌టికే అరెస్టు చేసిన వారిని త‌క్ష‌ణ‌మే వ‌దిలివేయాల‌ని పేర్కొంది. అంతేకాదు.. ఒక్క ఢిల్లీలోనే కాకుండా.. దేశ‌వ్యాప్తంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న విద్యార్థుల‌ను త‌క్ష‌ణ‌మే విడిచి పెట్టాల‌ని తెలిపింది. అయితే.. చిన్న ష‌ర‌తు విధించింది. గ‌తంలో నేరాలు చేసిన వారు.. క్రిమిన‌ల్ రికార్డులు ఉన్న‌వారిని మాత్రం దీని నుంచి మిన‌హాయించ‌వ‌చ్చ‌ని పేర్కొంది.

ప్ర‌స్తుతం జ‌రిగిన నిర‌స‌న‌ల‌ను కేవ‌లం విద్యార్థుల కోణంలోనే చూడాల‌ని.. వీటిని అల్ల‌ర్లు, దొమ్మీలు, జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టం కింద న‌మోదైన కేసుల కోణంలో చూడరాద‌ని స్ప‌ష్టం చేసింది. తాజా నిర‌స‌న‌ల‌పై దాఖలైన పిటిష‌న్ల‌ను వ‌రుస‌గా రెండోరోజు కూడా విచారించిన కోర్టు.. విద్యార్థులు చేప‌ట్టిన శాంతియుత నిర‌స‌న‌ల‌ను వారి ఆందోళ‌న‌ల‌ను భ‌విష్య‌త్తు కోణంలోనే చూడాల‌ని స్ప‌ష్టం చేసింది. విద్యార్థులేమీ జాతి ద్రోహులు కార‌న్న న్యాయ‌వాది వ్యాఖ్యల‌తో ఏకీభ‌విస్తున్న‌ట్టు తెలిపింది.

విద్యార్థుల్లో మైన‌ర్లు ఉంటే.. (18 ఏళ్ల లోపు వారు) వారిని కూడా ఎలాంటి కేసులు లేకుండా వ‌దిలి పెట్టాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఇక‌, విద్యార్థుల‌పై అమానుషంగా ప్ర‌వ‌ర్తించార‌న్న పోలీసుల‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకుంటున్నామ‌ని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి వారివ‌ల్ల వ్య‌వ‌స్థ‌ల‌పై న‌మ్మ‌కం పోతోంద‌ని తెలిపింది. నిర‌స‌న‌ల‌ను ప్ర‌జాస్వామ్య కోణంలోనే చూడాల‌ని.. వాటిని అణిచి వేసే ప్ర‌య‌త్నం చేయ‌రాద‌న్న గ‌త తీర్పులు పోలీసుల‌కు వ‌ర్తించ‌వా? అని ప్ర‌శ్నించింది.

ఈ నేప‌థ్యంలో ఢిల్లీ స‌హా దేశ‌వ్యాప్తంగా పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరును ఆక్షేపిస్తూ.. వారిపై ఇండిపెం డెంట్ విచార‌ణ‌కు ఆదేశించింది. ఈ విష‌యంలో కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాల పోలీసుల‌ను స‌మ‌న్వ యం చేసుకుని విచార‌ణ పార‌ద‌ర్శ‌కంగా సాగేలా చూడాల‌ని కోర్టు ఆదేశించింది. ప్ర‌తి ఒక్క‌రికీ స‌మాన హ‌క్కులే ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది. ఇక‌, పోలీసుల‌పై దాడి చేశారంటూ.. విద్యార్థుల‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై కూడా ఈ సంస్థ‌తోనే విచార‌ణ చేయించాల‌ని.. వీటిని వేరుగా విచారించ‌వ‌ద్ద‌ని పేర్కొంది.