పొలిమేరలో అర్జున్ అడుగు పెద్ద ప్లస్సు

హారర్ అంటే కామెడీతో కిచిడి అయిపోయిన ట్రెండ్ లో నేరుగా ఓటిటిలో రిలీజైన మా ఊరి పొలిమేర జనాన్ని భయపెట్టడంలో మంచి సక్సెస్ సాధించింది. ఆడియన్స్ దీన్ని రిసీవ్ చేసుకున్న విధానాన్ని గమనించిన దర్శక నిర్మాతలు రెండో భాగాన్ని థియేటర్లలో రిలీజ్ చేశారు. ఊహించని విధంగా ప్రేక్షకులు దానికి కూడా విజయం కట్టబెట్టారు. బడ్జెట్ పరిమితులు ఉన్నా స్క్రీన్ ప్లేతో మెప్పించగలిగితే వసూళ్లు రాబట్ట వచ్చని నిరూపించారు దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్.

ఇప్పుడు మూడో భాగానికి రంగం సిద్ధమవుతోంది. పొలిమేర 3 పేరుతో రూపొందుతున్న ఈ హారర్ డ్రామా కోసం యాక్షన్ కింగ్ అర్జున్ ని తీసుకొచ్చారు. తెలుగు సినిమాల్లో తరచుగా నటించే అర్జున్ కథ విషయంలో చాలా పర్టికులర్ గా ఉంటారు. అందుకే వచ్చిన ప్రతి అవకాశానికి ఎస్ చెప్పరు. పొలిమేర 3లో చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ ఆఫర్ చేశారని, కథను కీలక మలుపు తిప్పే ప్రధాన పాత్ర కావడంతోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇది పెద్ద ప్లస్ కానుంది.

ఎందుకంటే గత కొంతకాలంగా పెద్దగా ఫామ్ లో లేని అర్జున్ ఆ మధ్య స్వీయ దర్శకత్వంలో కూతురిని టైటిల్ రోల్ లో పెట్టి సీత పయనం తీశారు. అదేమో దారుణంగా పోయింది. అయితే అనుకోని విధంగా పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన బ్లాస్ట్ జోన్ సూపర్ డూపర్ హిట్ అయిపోయి అర్జున్ అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చింది. ఇంత లేటు వయసులో సోలో హీరోగా డెబ్భై కోట్ల గ్రాసర్ సాధించడం చిన్న విషయం కాదుగా. అందుకే అంత హ్యాపీ.

పొలిమేర 3కు మరో అనూహ్యమైన ప్రయోజనం ఏమిటంటే తమిళ, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమాకు మార్కెట్ దొరుకుతుంది. అర్జున్ వల్ల వందల కోట్ల రేట్లు పలకవు కానీ డబ్బింగ్ హక్కుల విషయంలో ధర గట్టిగానే రాబట్టొచ్చు. వచ్చే ఏడాది విడుదలకు రెడీ అవుతున్న పొలిమేర 3 లో చనిపోయిన రెండు భాగాల క్యారెక్టర్లు మినహా మిగిలిన క్యాస్టింగ్ మొత్తం కొనసాగనుంది. స్టార్లు లేకుండా ఆర్టిస్టుల మీద ఆధారపడిన పొలిమేర 3లో ఎట్టకేలకు ఒక స్టార్ అట్రాక్షన్ అయితే తోడయ్యింది.