సర్వేలో షాకులు… బాబు ఏం చేస్తారు?

ఆంధ్రప్రదేశ్లో ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ఎమ్మెల్యేల పనితీరును చంద్రబాబు మరోసారి రాబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 164 స్థానాల్లో కూటమి పార్టీల నాయకులు ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు. వీరిలో 134 మంది టిడిపి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలలో దాదాపు 70 మంది పనితీరు ఏ మాత్రం సరిగా లేదని పలు మార్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. వారి పనితీరును మార్చుకోవాలని కూడా ఆయన పదేపదే విన్నవించారు.

ఆ తర్వాత కొన్నాళ్లకు పరిస్థితి మారినప్పటికీ ఇంకా దారిలో పడని ఎమ్మెల్యేల సంఖ్య 30 నుంచి 40 మంది వరకు ఉన్నారనేది స్పష్టమైనది. ఇటీవల తాజాగా మరోసారి ఐ వి ఆర్ ఎస్ సర్వే ద్వారా ఎమ్మెల్యేల పరి తీరును చంద్రబాబు తెలుసుకున్నారు. దీనిలో ప్రధానంగా ప్రజల మధ్యకు వెళ్లడం, ప్రతినెలా ఇంటింటికి పంపిణీ చేస్తున్న పింఛన్ల కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనడం, ప్రజాదర్బార్లు నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయటం వంటివి కీలకంగా ఉన్నాయి.

అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చంద్రబాబు కోరుతున్నారు. ఎమ్మెల్యేల పనితీరును తాజాగా మరోసారి తెలుసుకున్నారు. దీనిలో మళ్లీ 30 నుంచి 40 మంది పనితీరు అలాగే ఉందని స్పష్టమైనట్టు సిఎం ఓ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో పనిచేయని ఎమ్మెల్యేలకు మరోసారి చంద్రబాబు క్లాసులు ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చూచాయగా చెప్పుకొచ్చారు.

నిజానికి ఎన్నికల సమయానికి మరో రెండు ఏళ్ల‌కుపైగా సమయం ఉంది. అయినప్పటికీ ఇప్పటినుంచే వైసిపి పై బలమైన పోరాటం చేయడంతో పాటు ప్రజల మధ్యకు వెళ్లాలి అనేది చంద్రబాబు ఆలోచన. ఆ దిశగా నాయకులు నడవాలని పదేపదే ఆయన చెబుతున్నారు. అయినా కొంతమంది నాయకులు పనితీరును మార్చుకోలేక పోతున్నారు. చంద్ర‌బాబు చెబుతున్న ఫార్ములాను  విస్మరిస్తున్నారు. ఈ వ్యవహారమే చంద్రబాబుకు ఆగ్రహం తెప్పిస్తోంది. మరి ఇప్పటికైనా నాయకులు మారతారా లేదా అనేది చూడాలి.