జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజాగా బీఆర్ ఎస్ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన కారెక్కారు. అయితే ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని వీడడాన్ని జగిత్యాలలో మెజారిటీ రాజకీయ వర్గాలు తప్పుబడుతున్నాయి. ఇదే సమయంలో పార్టీ ఆయనకు తక్కువ చేయలేదని, అనేక పదవులు ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు ప్రచారం ప్రారంభించారు.
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ తనకు అన్యాయం చేసిందని, సరైన గుర్తింపు ఇవ్వడం లేదని చెబుతూ జీవన్ రెడ్డి ఆ పార్టీతో విభేదించి బయటకు వచ్చారు. అయితే ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని అనుకున్నామని, కానీ ఆయన తొందరపడ్డారని కాంగ్రెస్ నేత దానం నాగేందర్ తెలిపారు. జీవన్ రెడ్డి విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పరిగణించారని కూడా చెప్పారు.
ఇక నియోజకవర్గ స్థాయిలో కూడా జీవన్ రెడ్డి తొందరపడ్డారన్న చర్చ నడుస్తోంది. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన స్థానికంగా ఆ పార్టీ నేతగానే ఎదిగారు. అంతేకాదు, బీఆర్ ఎస్‌కు వ్యతిరేకంగా కూడా పలు సందర్భాల్లో పోరాటాలు చేశారు. గతంలో కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాజకీయంగా కూడా 40 ఏళ్లకు పైగా కాంగ్రెస్‌లో ఉన్న జీవన్ రెడ్డి ఇప్పుడు బీఆర్ ఎస్‌లో చేరడంతో ఆయన వ్యక్తిగత ఇమేజ్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక ఓటు బ్యాంకును తనకు అనుకూలంగా మలుచుకున్న ఆయన ఇప్పుడు దాన్ని బీఆర్ ఎస్ వైపు మళ్లించగలరా అన్నది కీలకం. మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో, తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలపై చర్చ జరుగుతున్న వేళ జీవన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అన్నది ముందున్న రోజుల్లో తేలనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates