జగన్ ‘మావిగన్ జోకర్’ అంటున్న షర్మిల

వైసీపీ అధినేత జగన్ కు ఆయన సోదరి వైఎస్ షర్మిల కంటిలో నలుసులా మారిన సంగతి తెలిసిందే. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన తర్వాత జగన్ పై షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ ను విమర్శించే ఏ అవకాశాన్నీ షర్మిల వదలడం లేదు. ఆస్తి పంపకాలు మొదలు ఆంధ్రా డెవలప్మెంట్ వరకు జగన్ ను ఎక్కడికక్కడ కడిగిపారేస్తున్నారామె. ఈ క్రమంలోనే తన అన్నను జోకర్ అంటూ షర్మిల చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

దివంగత నేత వైఎస్సార్ జీవితాంతం వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడుగా జగన్ మారారని షర్మిల విమర్శించారు. 3 రాజధానులంటూ రుషికొండను మింగేసి ప్యాలెస్‌లు కట్టుకున్నారని జగన్ ను ఏకిపారేశారు. ఇప్పుడు ‘మావిగన్ జోకర్’‌గా జగన్ మిగిలారని సెటైర్లు వేశారు. సంక్షేమానికి సారథి వైఎస్సార్ అని, ఆయన ప్రవేశపెట్టిన ప్రతీ పథకం ప్రజల కష్టం, కన్నీళ్ల నుంచి పుట్టిందేనని అన్నారు.

తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ వైఎస్సార్ ప్రజాప్రస్థానం నిలిచి ఉంటుందని చెప్పారు. వైఎస్సార్ పాదయాత్రకు 23 ఏళ్లు అని గుర్తు చేసుకున్నారు. ఆయన వారసుడినని చెప్పుకునే జగన్ ఆయన పేరును వాడుకున్నారని, కానీ, ఆయన ఆశయాలకు వారసులు కాలేదని విమర్శించారు. వైసీపీలో వైఎస్సార్ ఐడియాలజీ లేదని, జగన్ సీఎం అయ్యాక కూడా వైఎస్సార్ జలయజ్ఞాన్ని పూర్తి చేయకపోవడమే అందుకు నిదర్శనమని చెప్పారు.

‘మాట తప్పం మడమ తిప్పం’ అన్న వైఎస్సార్ డైలాగ్ వాడుకోవడం తప్ప జగన్ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధమని మాట ఇచ్చిన జగన్..ఆ తర్వాత కల్తీ మద్యం అమ్మి ‘ఓన్లీ క్యాష్’ మాఫియా నడిపారని ఆరోపించారు.