10 ఉమ్మ‌డి జిల్లాల్లో వైసీపీ గ‌ల్లంతేనా?

వైసిపి అధినేత జగన్ ప్రకటించిన `ప్లాన్ బి` పెద్దగా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. రాష్ట్ర రాజధాని విషయంలో ప్రజలు ఒక నిశ్చితాభిప్రాయంలో ఉన్నప్పుడు.. దానిని మార్చాలని ప్రయత్నించటమే పెద్ద తప్పిదం అవుతుంది. గతంలో మూడు రాజధానులు అన్నప్పుడు కూడా ప్రజలు దానిని పట్టించుకోలేదు. నిజంగా ఆరోజు మూడు రాజధానులు అని ప్రకటించిన సమయంలో ప్రజల్లో ఆ తరహా చైతన్యం ఉండి ఉంటే కచ్చితంగా విశాఖపట్టణం, కర్నూలు, గుంటూరుజిల్లాలో వైసిపి విజయం సాధించి ఉండేది. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం, అమరావతి, క‌ర్నూలులో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది.

ఈ పరిణామాల నుంచి అయినా జగన్ పాఠాలు నేర్చుకుని ఉంటే ప్రస్తుతం ఆయన చెబుతున్న `ప్లాన్ బి` అనేది తెరమీదకి వచ్చి ఉండేది కాదు. కానీ జారుడు బండపై పరుగులు పెడుతున్న జగన్ తన విధానాన్ని, తన పద్ధతిని మార్చుకోకపోవడంతో ఇప్పుడు `మావిగన్` అనే సరికొత్త ప్రణాళికను తెర‌ మీదకు తీసుకువచ్చారు.

పోనీ ఇదేనా సక్సెస్ అవుతుందా అంటే నవ్వుల పాలు అవుతోంది తప్ప… ప్రజల్లో బలమైన చర్చకు కానీ, వైసీపీ ఆశిస్తున్న సానుకూల పరిణామం దిశగా కానీ అడుగులు వేసేలా కనిపించడం లేదు. ఫలితంగా వచ్చే ఎన్నికల నాటికి దాదాపు పది ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు పెద్ద ఎత్తున చెబుతున్నారు.

అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసే క్రమంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. దీంతో ఇటు ఐదు జిల్లాలకు-అటు ఐదు జిల్లాలకు కూడా అమరావతి రాజధాని కేంద్రంగా ఉంటుంది. రాయలసీమలో అనంతపురం, కడప వంటి వాటిని మిరహాయిస్తే మిగిలిన జిల్లాల్లో ప్రజలకు ఇది కేంద్రంగానూ అదే విధంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా కూడా అనుకూలంగా ఉంటుంది.

దీంతో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు, విశాఖపట్నం, ఉమ్మడి కృష్ణ జిల్లా అటువైపు చిత్తూరు నెల్లూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల ప్ర‌జ‌లు కూడా అమరావతి రాజధాని కావాలని కోరుకుంటున్న నేపథ్యం క‌నిపిస్తోంది.

దీంతో ఆయా జిల్లాల ప్రజలు కచ్చితంగా కూటమికి అనుకూలంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా ఏ సామాజిక వర్గం జగనను అభిమానించిందో.. ఆ సామాజిక వర్గమే ఇప్పుడు అమరావతిని కావాలని కోరుకుంటున్న నేపథ్యంలో జగన్ పేల్చిన మావి`గన్` ఏమాత్రం పేలగపోగా.. రివర్స్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇది అత్యంత బలమైన ప్రభావం చూపించినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు చెబుతున్నారు. ఇతర అంశాల కంటే కూడా వచ్చే ఎన్నికల నాటికి అమరావతి రాజధాని అంశం ప్రధానంగా ప్రజల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

గత ఎన్నికల్లో గమనిస్తే ఇటువంటి భూములకు సంబంధించిన వ్యవహారమే ప్రజల మధ్య చర్చకు వచ్చింది. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది జగన్ ను ఎంత బలంగా దెబ్బతీసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే భూముల వ్యవహారం రాజధాని రూపంలో జగన్‌కు శాపంగా పరిణమించే అవకాశం ఉందన్నది పరిశీలకులు చెబుతున్న మాట. మరి ఇప్పటికైనా జగన్ తన మైండ్ సెట్‌ను మార్చుకుంటారో లేదో చూడాలి.